విజయమ్మ ఉద్వాసన వెనక ప్యాలెస్ కూ!
Publish Date:Jul 8, 2022
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుదు జగన్మోహన్ రెడ్డి తల్లి, వైఎస్ విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిజానికి, గౌరవాధ్యక్ష పదవి అంత క్రియాశీల పదవి కాదు. ఆ పదవిలో ఉన్న ఎవరైనా తలకెత్తుకుని మోసే బరువు బాధ్యతలు ఏమీ ఉండవు. అంతే కాదు, పార్టీల మధ్య రక్త సంబంధం వంటి బంధం ఏదైనా ఉంటే, ఒకే వ్యక్తీ రెండు కాదు, ఇంకెన్ని పార్టీలకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నా, అభ్యతరం ఉండదు. అంతే కాదు, గౌరవాధ్యక్ష పదవి గౌరవం పార్టీకే కానీ, వ్యక్తులకు సంబంధించినది కాదు. ఆమె ఆ పదవిలో కొనసాగడం వలన పార్టీ గౌరవం ఇనుమడిస్తుందే తప్ప, ఆమె గౌరవానికి కిరీటాలు తొడిగినట్లు కాదు. అలాగే, ఆమెను ఆ పదవి నుంచి తప్పించడం వలన, పార్టీ ప్రతిష్ట దిగాజరుతుందే కానీ, ఆమె గౌరవానికి వచ్చే తలవంపులు ఏమీ ఉండవు. అయితే, ఇంత కాలం దివంగత మహా నేత, అంటూ సెంటిమెంట్ ను రంగరించి ఓట్లు దండుకున్న జగన్ రెడ్డి, ఇక పై ఆ మహా నేతను తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోలేక పోవచ్చును. ఒక విధంగా వైసేపీకి వైఎస్సార్ తో ఉన్న సున్నిత రాజాకీయ బంధం తెగిపోయింది. కాదు తెంచే సుకున్నారు అనుకోవచ్చని, అ మేరకు వైసీపీకి కొంత దెబ్బ తగిలే ప్రమాదం ఉందని అంటున్నారు. అదొకటి అలా ఉంటే, విజయమ్మ వైసీపీ ప్లీనరీ వేదిక నుంచి, తమ నిర్ణయాన్ని ప్రకటించడం, అదే వేదిక నుంచి ఆమె చేసిన ప్రసంగం జాగ్రత్తగా గమనిస్తే, ఇది ఆమె ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం అనిపించదు. నిజానికి,గత కొద్ది రోజులుగా, ఆమె ప్లీనరీ వేదిక నుంచి రాజీనామా నిర్ణయం ప్రకటిస్తారని, ఆమె ఆరోపించిన విధంగా ఎల్లో మీడియాలోనే కాదు, అసత్య ఆత్మ సాక్షి సహా బ్లూ , బ్లాక్, రెడ్ మీడియాలలోనూ కథలు, కథనాలు వచ్చాయి. అయితే, ఆ విషయంపై మాట్లాడవలసిన వారు మాట్లాడలేదు. స్పందించవలసిన జగన్ రెడ్డి, పోనీ సజ్జల స్పదించలేదు. కానీ, మంత్రి బొత్స సత్యనారాయణ వంటి, వైఎస్ ఫ్యామిలీ ఆత్మీయ మిత్రులు ఇతర నాయకులు మాత్రం మాట్లాడారు. మీడియా కథనాలను ఖండించారు. అలాంటిదేమీ లేదని, ఆమె ప్లీనరీలో పాల్గొంటారు, పార్టీ గౌరవాధ్యక్ష పదవిలో కొనసాగుతారు, అని చెప్పు కొచ్చారు.పనిలో పనిగా, సహజ ధోరణిలో ఎల్లో మీడియాను దుష్ట చతుష్టయం అంటూ తిట్టిపోశారు. కానీ,ఏమి జరిగిందో కళ్ళ ముందుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పార్టీ గౌరవ అధ్యక్షురాలిని అగౌరవంగా సాగనంపేందుకు, ఎవరో ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్, యథాతథంగా అమలైందనే విషయం ప్లీనరీ తేర మీద, లైవ్ లో దర్సన మిచ్చింది. అది నిజం, బొత్స సహా ఎవరూ కానలేని నిజం. అయితే ఈ స్క్రిప్ట్ ఎవరు తయారుచేశారు? ఎక్కడ తయారు చేశారు? ఎందుకు తయారు చేశారు? ఇప్పడు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెపుతారు? చెప్పవలసిన వారు అయితే చెప్పరు. బొత్స వంటి వారు చెప్పే కట్టు కథలకు, విలువలేదు. అయినా సరే, అలాగే అనుకుందాం, ఎల్లో మీడియానే స్క్రిప్ట్ తయారు చేసింది అనుకుందాం? మరి అమలు చేసింది ఎవరు? ప్లీనరీ వేదిక మీద ఆమె చేత ఆ పలుకులు పలికించింది ఎవరు? నిజమే ఒక తల్లిగా, విజయమ్మ కొడుకు తప్పును తప్పుగా చూడక పోవచ్చును. అలాగే కొడుకు వైపున్న కుటుంబ సభ్యులు, కొడుకు వైపున్న బొత్స వంటి ఆత్మీయ కుటుంబ మిత్రులు, రాజకీయ ఆత్మ బంధువుల కుట్రలను తెలుసుకోలేక పోవచ్చును లేదా తెలుసుకున్నా పేగు బంధంతో ఆమె నోటికి తాళం వేసుకున్నారో ఏమో కావచ్చును, కానీ, వైసీపే గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను, సగౌరావంగా సాగనంపే, స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్’లో, తయారైంది అనేది అక్షర సత్యమని, కొంచెం ఆలస్యంగానే అయినా వైఎస్ అభిమానులు గుర్తిస్తున్నారు. వైసీపే అభిమానులు గుర్తిస్తున్నారు. వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని బాధ పడే వారు, బాధ పడుతున్నారు. నిజానికి, విజయమ్మ ఉద్వాసనకు కుటుంబ కలహాలు, ఆస్తి తగవులు కారణమని ఇడుపులపాయ సమాధుల ఆత్మసాక్షిగా చాలా కాలంగా మీడియా చెప్పిందే నిజమని ఇప్పుడు రుజువైందని, కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తున్నారు. వైఎస్ కన్ను మూసిన తర్వాత జగన్ రెడ్డికి రాజకీయంగా అండగా నిలిచింది తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల. జగన్ రెడ్డి జైల్లో ఉన్న రోజుల్లో కానీ, 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర సాగించిన సమయంలో కానీ, పార్టీ వ్యవహారాలను కుటుంబ పరంగా నడిపించింది,ఆ ఇద్దరే, ఇందులో ఎవరికీ సందేహం లేదు. భార్య భారతి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటే, అమ్మ చెల్లి, రాజకీయ వ్యహారాలు చక్కపెట్టారు. ఇదే విషయాన్ని విజయమ్మ ప్లీనరీ వేదికనుంచి చేసిన వీడ్కోలు ప్రసంగంలోనూ, పరోక్షంగానే అయినా ప్రస్తావించారు. ముఖ్యంగా, జగనన్న విడిచిన బాణం అంటూ, షర్మిల చేసిన పాదయాత్రను గుర్తు చేశారు. అయినా అంత చేసినా, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన సుఖం తాను చూసుకుని చెల్లిని కష్టాలలోకి నేట్టేశారనే అర్ధం వచ్చేల విజయమ్మ సుతిమెత్తగా, చురకలు అంటించారు. ఇప్పుడు జగన్ రెడ్డికి తన అవసరం, చెల్లి అవసరం లేదని మనసులోని బాధను మరో రకంగా వ్యక్త పరిచారు. అందుకే కష్టాల్లో ఉన్న షర్మిలను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించే, తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరిట పార్టీ పెట్టి కష్టాలు పడుతున్న షర్మిలకు అండగా నిలిచేందుకే, వైసీపీ తో తెగతెంపులు చేసుకుంటున్నానని. విజయమ్మ పేర్కొనారు. అయితే, జగన్ రెడ్డి తల్లి, చెల్లిని ఎందుకు దూరం చేసుకున్నారు అంటే, అందుకు తెర వెనక వ్యక్తులు కారణమని అంటున్నారు. అక్రమాస్తుల కేసుల్లో, జగన్ రెడ్డి జైలుకు పొతే (పాపం శమించుగాక), ముఖ్యమంత్రి కుర్చీకి షర్మిల లేదా విజయమ్మ పోటీకి రాకుండా, తాడేపల్లి ప్యాలెస్’లో పొలిటికల్ మెలో డ్రామాకు స్ర్కిప్ట్ తయారైందని, అంటున్నారు. అలాగే, షర్మిల ఉద్వాసంతో మొదలైన, ‘భారతి’ ప్రొడక్షన్స్ చిత్రానికి విజయమ్మ నిష్క్రమణతో శుభం కార్డు పడిందని, ప్యాలెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది... నిజానిజాలు ఏమిటో ఆ ఏసు నాధునికే.. తెలియాలి..అంటున్నారు.
http://www.teluguone.com/news/content/palace-coup-behind-vijayamma-resignation-25-139360.html





