అమెరికా ఆర్మీడేకి చీఫ్ గెస్ట్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్
Publish Date:Jun 13, 2025
.webp)
Advertisement
భారత్ కి దౌత్యపరమైన దెబ్బ.. కాంగ్రెస్ ఆందోళన
పాక్ అమెరికా లు సంప్రదాయ మిత్ర దేశాలు. అయితే 911 దాడుల తర్వాత పాక్ కి దూరం జరుగుతూ వచ్చింది అమెరికా. అప్పట్లో జార్జి బుష్ కి లాడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలుండేవి. నేడదే సీన్ రిపీట్ అవుతూ వస్తోంది. మీకు తెలుసో తెలీదో గానీ మునీర్ కి ట్రంప్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయ్. ట్రంప్ పిల్లలకు చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే బిట్ కాయిన్ సంస్థ తో మునీర్ నాయకత్వంలో పాకిస్తాన్ ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసింది. ఈ సంస్థ పాక్ భూభాగం కేంద్రంగా బిజినెస్ చేస్తోంది. ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరిందో తెలిస్తే ఎవరైనా సరే షాక్ కాక తప్పదు. ఒక పక్క పాక్, భారత్ మధ్య భీకరమైన యుద్ధ వాతావరణం ఏర్పడి ఉన్న సమయంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఆ మాటకొస్తే పహెల్గాం దాడులకూ మునీర్ వ్యాఖ్యలకు సంబంధముందని అంటారు కాంగ్రెస్ కమ్యూనికేషనల్ హెడ్ అయిన జైరామ్ రమేష్. మునీర్ రెచ్చగొట్టిన తర్వాతే ఉగ్రవాదులు కాశ్మీర్ లో రెచ్చిపోయి 26 మందిని హతం చేశారు.
ఇప్పుడు కాశ్మీర్ పర్యాటకం లేక విలవిలలాడుతోంది. దానికి తోడు ఆ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం భారత్ పర్యటనలో ఉన్నారు. వీటన్నిటిని బట్టీ చూస్తే ఈ దాడిలో ఇన్ డైరెక్టుగా అమెరికా పాత్ర ఉన్నట్టు కూడా అనుమానించాలి. మొన్న ఇదే మునీర్ ఏదో సాధించేసినట్టు.. అతడికి ఫీల్డ్ మార్షల్ పదవినిచ్చి సత్కరించింది పాకిస్తాన్. ఇప్పుడు చూస్తే అమెరికా ఆర్మీ పెరెడ్ కి మునీర్ కు అనూహ్య ఆహ్వానం. దీనంతటి వెనక అసలేం నడుస్తోందన్నది సస్పెన్స్ గా మారింది. ఈ ఆర్మీడే ఆహ్వానానికి ముందు యూఎస్ జనరల్ ఒకరు పాకిస్తాన్ ను ఉగ్రవాద నియంత్రణలో అత్యుత్తమ భాగస్వామిగా అభివర్ణించడం కొసమెరుపు. అంతే కాదు రెండేళ్లలో ఈ ఇద్దరు.. అంటే అమెరికా, పాక్ జనరల్స్ మూడు సార్లు కలిసినట్టు రిపోర్టులున్నాయి. హఫీజ్ సయీద్, మసూద్ అజర్ వంటి వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ ట్రెర్రరిస్టులకు రక్షణ, శిక్షణతో పాటు వారి కోసం నిధుల సేకరణ కూడా చేసే పాక్ ప్రభుత్వం ఉగ్రవాద నియంత్రణలో భాగస్వామి ఎలాగయ్యిందో అమెరికాకు తప్ప ఇంకెవరికీ అర్ధం కాదు.
గతంలో ఇదే పాక్ రక్షణ మంత్రి తాము గతంలో యూఎస్ కోసం రష్యాకు వ్యతిరేకంగా ఎన్నో చెత్త పనులు చేసిన మాట వాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ ఏ కొత్త చెత్త పనులు యూఎస్ కోసం పాక్ చేస్తుందో అర్ధంకాని అగమ్యగోచరం. ఇక్కడ పాకిస్థాన్ ఉచ్చులో అమెరికా చిక్కిందా.. లేక అమెరికా ఉచ్చులో పాక్ చిక్కిందా? అన్నదొక సస్పెన్స్. గ త కొంత కాలం నుంచి పాకిస్థాన్ కి ఏకైక ఆర్ధిక ఆదరవు చైనా. చైనా పాక్ భూభాగాన్ని ఆశించి.. చైనా పాక్ కారిడార్ పేరిట ఒక ప్రపంచ రహదారి నిర్మాణం చేయడమే కాదు.. హైబ్రిడ్ రోడ్లు, సీపోర్టులు, ఎయిర్ పోర్టులు నిర్మిస్తోంది.
అయితే బలూచిస్తాన్ స్వేచ్చా పోరాటం చేయడంతో పాటు తమది స్వతంత్ర దేశమని ప్రకటించుకుంది. ఆ దేశం గానీ రేపటి రోజున అధికారికంగా పాక్ నుంచి డిటాచ్ అయితే చైనాతో పాక్ సంబంధాలు పూర్తిగా చెడిపోయే పరిస్థితి. ఇప్పటికే బలూచీలు తమ భూభాగంలోని చైనీయులను తరిమి తరిమి కొడుతున్నారు. ఈ సిట్యువేషన్లో చైనా కూడా ఆలోచనలో పడింది. దానికి తోడు సింధ్ లో నీటి కటకట కారణంగా ఏకంగా హోం మంత్రి ఇంటికే నిప్పు పెట్టిన పరిస్థితి.
పరిస్థితులు ఎంత మాత్రం సజావుగా లేక పోవడంతో.. మునీర్ నాయకత్వంలో అమెరికాకు మరింత దగ్గరయ్యేలా పథక రచన చేసింది పాక్. అంతే కాదు అమెరికాకు కూడా పాక్ సాయం అవసరం. కారణమేంటంటే చైనాతో యూఎస్ విపరీతమైన వాణిజ్య యుద్ధం చేస్తోంది. అందులో భాగంగా చైనా ఇటీవల అరుదైన ఖనిజాలను అమెరికాకు సరఫరా చేయడాన్ని ఆపేసింది. దీంతో అమెరికా చైనాను కట్టడి చేయడానికంటూ పాక్ ని దగ్గరకు చేర్చుకుంటోందని తెలుస్తోంది.
అందుకే వద్దన్నా ఐఎంఎఫ్ లోన్లు, వరల్డ్ బ్యాంకు అప్పులు పాక్ కి ఇప్పిస్తోంది అమెరికా. దానికి తోడు మునీర్ కి కూడా ఏదో ఒక అగ్రదేశం అండ కావాలి. వారి ద్వారా దేశాన్ని ముందుకు నడపాల్సిన పరిస్థితి ఉంది. భారత్ ఇటు బలూచీలను రెచ్చగొడుతూ.. అటు ఆఫ్టన్లతో చెలిమి చేస్తోంది. దీంతో అన్ని రకాలుగా తిరిగి అమెరికాకు దగ్గరవ్వడమే లక్ష్యంగా పాక్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మునీర్ కు అమెరికా ఆర్మీడేకు ఆహ్వానం అన్నది దౌత్య పరంగా భారత్ కి భారీ ఎదురుదెబ్బ అంటోంది కాంగ్రెస్.
ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే పాక్ డయాస్పోరా సైతం ఈ ఆహ్వానానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పార్టీ అమెరికాలోని పాక్ ఏంబసీ ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అమెరికాతో ఏ ఒప్పందమైనా సరే పాక్ కి నష్టమేనంటోంది ఇమ్రాన్ పార్టీ. ఇన్నేసి దుశ్శకునాల మధ్య అసీం మునీర్ ఏం సాధిస్తాడో తెలియాల్సి ఉంది.
ఇక్కడో మరో గుర్తించాల్సిన విషయమేంటంటే.. అమెరికా జూన్ 14న తన 250వ ఆర్మీడే జరుపుకుంటోంది.. సరిగ్గా అదే రోజు ట్రంప్ 79వ బర్త్ డే కూడా. దానికీ మునీర్ హాజరవుతున్నాడు. సరే.. మరి అమెరికన్ సోల్జర్స్ ని ఉద్దేశించి ఆయనెలా వారికి ప్రేరణగా నిలుస్తాడన్నది అర్ధం కావడం లేదెవరికీ. కారణమేంటంటే ప్లాన్స్ లేవు- ప్రేయర్స్ తప్ప అంటూ ఆపరేషన్ సిందూర్ లో చేతులెత్తేసిన మునీర్ వీరికెలా ఇన్ స్పిరేషన్ అవుతాడో అర్దం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరూ.
http://www.teluguone.com/news/content/pakisthan-army-chief-muneer-chief-guest-to-america-army-day-39-199858.html












