డాక్టర్ నిర్లక్ష్యం.. 400 మంది చిన్నారులకు హెచ్ఐవీ
Publish Date:May 17, 2019
Advertisement
ఒక వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా 500 మందికి పైగా హెచ్ఐవీ బారిన పడ్డారు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా జిల్లాలో గత నెల అనేక హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలా మంది చిన్నారులే ఉండటంతో ప్రొవిజినల్ హెల్త్ అధికారులు అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా రక్తపరీక్ష శిబిరాలు ఏర్పాటుచేశారు. ఆ రిపోర్ట్లు చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏకంగా 500మందికి పైగా హెచ్ఐవీ బారిన పడినట్లు గుర్తించారు. వారిలో దాదాపు 400 మంది చిన్నారులే కావడం గమనార్హం. దీంతో దర్యాప్తు చేపట్టగా.. హెచ్ఐవీ సోకిన చిన్నారులంతా గత నెల్లో స్థానిక చిన్న పిల్లల వైద్యుడు ముజఫర్ ఘంగర్ ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లినట్లు తెలిసింది. దీంతో అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కలుషిత సిరంజీని పిల్లలకు ఉపయోగించడం వల్లే వారికి హెచ్ఐవీ సోకినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేగాక ముజఫర్.. రటోడెరోలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడ కూడా అతడు నిర్లక్ష్యంగా ఒకే సిరంజీని అనేక మందికి ఉపయోగించినట్లు తెలిసింది. పైగా ముజఫర్ కూడా ఎయిడ్స్ బాధితుడు కావడం గమనార్హం. అభం శుభం తెలియని చిన్నారులకు ఈ మహామ్మరి సోకడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ఆదుకోవాలని వారికి మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. తమ పిల్లలకు ఈ పరిస్థితి కల్పించిన వైద్యుడికి మరణశిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఐవీ కేసుల్లో పాకిస్తాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. ఒక్క 2017లోనే దేశ వ్యాప్తంగా దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వైద్యుల నిర్లక్ష్యం కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతోంది. డబ్బును ఆదా చేయవచ్చుననే దురుద్దేశంతో అనేక మంది వైద్యులు ఒకే సిరంజిని అనేక మందికి వినియోగిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/pakistan-doctor-held-after-400-children-diagnosed-with-hiv-39-86998.html





