అమెరికా అధీనంలో పాక్ ఎయిర్ బేస్ లు.!
Publish Date:Jul 16, 2026
Advertisement
పాకిస్థాన్ లోని కీలక వైమానిక స్థావరాలన్నీ అమెరికా అధీనంలో ఉన్నాయా? అంటే అంతర్జాతీయ మీడియా కథనాలు ఔననే అంటున్నాయి. ఒక వైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం. ముఖ్యంగా ఆసియా ఖండంలో చైనా, ఇండియా ప్రాబల్యాన్ని గమనిస్తూ.. తన సొంత భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం అమెరికా ఈ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు.. పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఆ దేశంపై తెచ్చిన ఒత్తిడులు సత్ఫలితాలను ఇచ్చాయని రక్షణ రంగ నిపుణులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొది. ఈ మార్పులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పాకిస్తాన్ భూభాగంలోని వ్యూహాత్మకమైన మూడు వైమానిక స్థావరాలు పూర్తిగా అమెరికా సైనిక దళాల నిర్వహణలో ఉన్నాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ అధినేత ఈ విషయాన్ని స్వయంగా స్వయంగా ధృవీకరించినట్లు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అమెరికా అధీనంలోకి తీసుకున్న స్థావరాలలో ప్రముఖమైనది నూరు అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్. ఈ రక్షణ కేంద్రం భౌగోళికంగా పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైనది. అమెరికా సైన్యం ఈ ప్రాంతాలను తమ సొంత నియంత్రణలోకి తీసుకున్నప్పటి నుండి అక్కడ కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేస్తోంది. ఈ ఎయిర్ బేస్‌ల అంతర్గత పరిసరాల్లోకి కనీసం పాకిస్తాన్ సైనికులు ఉన్నతాధికారులకు కూడా అనుమతి లేదు. ఈ వ్యూహాత్మక సైనిక మోహరింపు వెనుక కేవలం భూభాగాన్ని ఆక్రమించడం మాత్రమే కాకుండా.. భారీ సైనిక వ్యూహం దాగి ఉందని రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. అమెరికా అధీనంలో ఉన్న నూరు అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌లో వాషింగ్టన్ అధునాతనమైన ఎఫ్ 35, ఎఫ్ 16 ఫైటర్ జెట్లను పెద్ద సంఖ్యలో మోహరించింది. పాకిస్తాన్ కలిగి ఉన్న అత్యంత రహస్య అణ్వాయుధ నిల్వ కేంద్రాలకు ఈ వైమానిక స్థావరం చాలా సమీపంలో ఉండట వల్లే.. దీనిపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోంది. దీని ద్వారా పాక్ అణ్వాయుధాల గమనాన్ని, వాటి నిల్వలను నిరంతరం నిఘా నీడలో ఉంచడం అమెరికాకు సులువవుతుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలోనే ఇరు దేశాల మధ్య రహస్య రక్షణ ఒప్పందాలు కుదిరిందన్నది అంతర్జతీయ మీడియా కథనాల సారాంశం. అంతేకాకుండా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుబంధ కంపెనీలకు పాకిస్తాన్ భూభాగంలోని విలువైన ఖనిజ సంపదను తవ్వుకునేందుకు అనూహ్యంగా అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఈ ఆర్థిక, వ్యూహాత్మక లొంగుబాట్లు జరిగినప్పుడే, పాకిస్తాన్ భవిష్యత్తు పూర్తిగా అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయిందనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తీవ్రమైన ద్రవ్యోల్బణం, విదేశీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్, అమెరికా ఇచ్చే రుణ సహాయాల కోసమే తన దేశ రక్షణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని అంటున్నారు. అయితే.. పాకిస్తాన్, అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు కొత్తవేమీ కావు. కాకపోతే, గతంలో కేవలం ఉగ్రవాద నిర్మూలన లేదా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల కోసమే పరిమితమైన ఈ సంబంధాలు, ఇప్పుడు పాక్ సొంత స్థావరాలపై అమెరికా అధిపత్యం చెలాయించే స్థాయికి చేరడం గమనార్హం. గతంలో అమెరికా తన డ్రోన్ దాడుల కోసం పాక్ వైమానిక స్థావరాలను వాడుకున్నప్పటికీ.. పాక్ సైనికులను కూడా నిరోధించే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుత విదేశీ విధానాలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత సమస్యల కారణంగా దాయాది దేశం పాకిస్థాన్ బేరసారాల శక్తిని కోల్పోయింది. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం పాకిస్థాన్ అమెరికా ముందు మోకరిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆసియాలో చైనాను కట్టడి చేసే నెపంతో పాకిస్తాన్‌ను అమెరికా ఒక పావుగా వాడుకుంటోందనేది బహిరంగ రహస్యంగా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వం తన స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం చేసిన ఈ ఒప్పందాలు, దీర్ఘకాలంలో ఆ దేశ ఉనికికే ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. US Military Presence Pakistan, US Pakistan Strategic Relations, Pakistan Nuclear Weapons Storage, Former ISI Chief Revelations
http://www.teluguone.com/news/content/pak-airbases-under-us-control-36-226138.html





