అతితెలివికి ఆకారం కేటీఆర్!
Publish Date:Jul 31, 2024
Advertisement
అతి తెలివితేటలకి ఆకారం ఇస్తే ఎలా వుంటుందంటే, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌లాగా వుంటుంది. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు.. ఆయన ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా ఆ మాటల్లో అతి తెలివితేటలు స్టీరియో ఫోనిక్ సౌండ్ డీటీఎస్‌లో వినిపిస్తూ వుంటాయి. తమ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్ కుటుంబం భరించలేకపోతోంది. ఆ కడుపులో మంట కేటీఆర్ నోట్లోంచి బయటపడుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య పుల్లలు పెట్టే మాటలను అతి తెలివిగా మాట్లాడుతున్నారు. ఆ అతితెలివి మాటలను కేటీఆర్ తాను చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటూ వుండొచ్చు.. అది వేరే విషయం! మొదట్నుంచీ కేటీఆర్ అనే మాట ఏమిటంటే, ఉప ముఖ్యమంత్రిగా వున్న మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ డైలాగు కేటీఆర్ వీలున్నప్పుడల్లా వాడుతున్నారు. పైకి మాత్రం రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి అవ్వాలన్న బిల్డప్పు, కానీ మనసులో వున్న పాయింట్ మాత్రం వేరే. మల్లు భట్టి విక్రమార్క మనసులో ‘ముఖ్యమంత్రి’ అనే బీజాన్ని నాటడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు సృష్టించాలన్నది కేటీఆర్ ప్లాన్. అందుకే భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈరకంగా పదకొండో శతాబ్దం రాజకీయ తెలివితేటలను కేటీఆర్ ఇరవై ఒకటో శతాబ్దంలో ఉపయోగిస్తున్నారు. ఈయన మాటలను మనసులో పెట్టేసుకునేంత అమాయకుడు కాదు భట్టి విక్రమార్క. అయినా దళితుడైన భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు తెగ ఫీలైపోతున్న కేటీఆర్ తన తండ్రికి ఈ ఉపదేశం ఎందుకు చేయలేదో! తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. రెండుసార్లూ తానే ముఖ్యమంత్రి అయ్యారు. మూడోసారి కూడా తానే ముఖ్యమంత్రి అయి, నాలుగోసారి కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్క విషయంలో చేస్తున్న కామెంట్లు, కేటీఆర్ తన తండ్రి దగ్గరే చేసి వుంటే బాగుండేది కదా? అందుకే ఆచార్య ఆత్రేయ, ‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి’ అని ఏనాడో చెప్పారు. కేటీఆర్ లాంటివాళ్ళు ఆ నీతులను ఈనాడూ అమలు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/over-smartness-of-ktr-39-181869.html





