మల్లంపల్లి మండలానికి బీఆర్ఎస్ నేత పేరు.. మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క
Publish Date:May 31, 2025
Advertisement
రాజకీయం అంటే ప్రత్యర్థులపై కేసులు, ప్రతీకార చర్యలు, కక్ష సాధింపులుగా మారిపోయిన నేటి రోజులలో ఓ నాయకురాలు మాత్రం అందుకు భిన్నంగా నిలిచారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు చేసిన సేవలను గుర్తించి ఒక మండలానికి ఏకంగా ఆయన పేరునే ప్రతిపాదించి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఔను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క ప్రతిపాదనను గౌరవించి ఓ మండలానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడి పేరు పెట్టింది. ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేస్తూ శనివారం (మే 31) గెజిట్ విడుదలైంది. ఇంతకీ జేడీ ఏమిటంటారా. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. జడ్పీ మాజీ అధ్యక్షుడు దివంగత కుసుమ జగదీష్. బీఆర్‌ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మల్లంపల్లిని మండ లంగా ప్రకటించాలంటూ కుసుమ జగదీష్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా కుసుమ జగదీష్ ఇటీవల మరణించారు. ఆ సమయంలో కుసుమ జగదీష్ కు నివాళులర్పించిన సీతక్క.. మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెడతామనీ, ఇందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాననీ హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. కుసుమ జగదీష్ సేవలకు గుర్తింపుగా మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెట్టాలన్న మంత్రి సీతక్క ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మల్లంపల్లి మండలానికి ఆయన పేరు చేరుస్తూ జేడీ మల్లంపల్లిగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరును మండలానికి పెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇందుకు కృషి చేసిన మంత్రి సీతక్క రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేశారంటూ మల్లంపల్లి మండల సాధన సమితి సభ్యులు, ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.
http://www.teluguone.com/news/content/opposition-party-leader-name-to-mallampally-mandal-25-199066.html





