రేషన్ కార్డు ఉంటే ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు!
Publish Date:May 14, 2020
Advertisement
ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా ఈ రోజు తొమ్మిది విభాగాల కేటాయింపులను ఆమె మీడియాకు వివరించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్, ఉద్యోగ కల్పన తదితర అంశాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలను ప్రకటించారు. ‘‘రేషన్ కార్డు ఉన్న వారు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఒక్కో వ్యక్తికి 5కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తాం. ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు, రేషన్ కార్డు లేనివారు కూడా బియ్యం, గోధుమలు, పప్పు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా.. కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రేషన్ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నాటికి ఒకే దేశం - ఒకే కార్డు విధానం అమలులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది’’ అని తెలిపారు. ‘సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నాం. సన్న కారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కిసాన్ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు రూ.4.22లక్షల కోట్ల రుణాలు ఇప్పటికే మంజూరుచేశాం. ఈ రుణాలపై మూడు నెలల మారటోరియం కల్పిస్తున్నాం. రైతులకు 25లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశాం. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చిలో 29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్ చేసింది. ఇంతటితో వ్యవసాయరంగానికి సాయం ముగిసినట్టు కాదు’’ అని వివరించారు. రాష్ట్రాల మధ్య కనీస వేతనంలో వ్యత్యాసాలు ఉన్నాయి. దేశమంతా ఒక్కటే కనీస వేతనం ఉండేలా చేస్తాం. వసల కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. వలస కార్మికులందరినీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకొనేలా వెసులుబాటు కల్పిస్తాం. సంస్థలు, కంపెనీలన్నీ నేరుగా కార్మికులను నియమించుకొనేలా ఏర్పాటు. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తాం. సుదూర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్తున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తాం. ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద రాష్ట్రాలకు ఇప్పటికే రూ.11,002 కోట్లు కేటాయించాం’’ అని చెప్పారు.
http://www.teluguone.com/news/content/one-nation-one-ration-card-says-nirmala-sitharaman-25-99157.html





