శెభాష్ అవ్వా.. అధికారులపై కోర్టుకెక్కింది.. సక్సెస్సయింది
Publish Date:Jan 31, 2022
Advertisement
ఏపీలో వృద్ధాప్య పింఛన్ల కోసం కూడా కోర్టుకెక్కి సాధించుకోవాల్సిన దుర్గతి పట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా వృద్ధాప్య పింఛనుకు అర్హులైనా కూడా ప్రభుత్వ ఫలాలు అందకుండా పోతున్నాయి. ఇక నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన 65 ఏళ్ల కాకర్ల సరోజనమ్మ 2019 నుంచి పింఛను అందుకుంటోంది. అయితే ఏవో కారణాలు చూపుతూ, ఏవేవో కొర్రీలు వేస్తూ అధికారులు సరోజనమ్మ పింఛనుఆపేశారు. పింఛను కోసం ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టు తిరిగినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆమె కోర్టుకెక్కింది. ఆమె బాధను, అవసరాన్ని గుర్తించిన కోర్టు సరోజనమ్మకు వెంటనే పింఛను పునరుద్ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఎప్పటి నుంచి ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కకట్టి చెల్లించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశింది.
జనవరి 2020 నుంచి ఆమెకు పింఛను రావడం ఆగిపోయింది. దీంతో అధికారులను కలిసి ప్రశ్నిస్తే.. 24 ఎకరాల పొలం ఉండడంతోనే పింఛను ఆపేసినట్టు చెప్పారు. అయితే, తనకున్నది 4.90 ఎకరాల మెట్ట భూమి మాత్రమేనని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇక లాభం లేదని గతేడాది అక్టోబరులో సరోజనమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం నెల రోజుల్లో సరోజనమ్మ పింఛను పునరుద్ధరించాలని ఆదేశించింది. అలాగే, ఆగిన కాలానికి సంబంధించి మొత్తాన్ని లెక్కకట్టి అది కూడా చెల్లించాలని సూచించింది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు గత నెలలో సరోజనమ్మ పింఛను పునరుద్ధరించారు. అయితే, ఆగిన 22 నెలల కాలానికి సంబంధించిన పింఛను సొమ్ము మాత్రం చెల్లించలేదు. దీంతో సరోజనమ్మ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆఘమేఘాల మీద 22 నెలల పింఛను మొత్తం రూ.47,250లను సరోజనమ్మకు అందించారు.
http://www.teluguone.com/news/content/old-woman-gets-pension-through-high-court-39-130982.html





