భారత్ అంటే ట్రంప్ కు కడుపుమంట ఎందుకో తెలుసా?
Publish Date:Aug 8, 2025
Advertisement
అజిత్ ధోవల్ రష్యా పర్యటనలో ఉండగా తెలిసిన వార్త ఏంటంటే పుతిన్ భారత్ పర్యటన త్వరలో ఖరారు కానుందని. ఇదిలా ఉంటే, మోడీ ఐదేళ్ల తర్వాత చైనా పర్యటించనున్నారు. ఈ రెండు వార్తలూ వేర్వేరే అయినా.. ట్రంప్ మాత్రం ఈ ముగ్గురూ కలసి ఏదైనా చేస్తారా? అన్న టెన్షన్ తో అల్లాడుతున్నట్టు సమాచారం. దీంతో ఆయన భారత్ పై సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం సుంకాలు పెంచిన ట్రంప్ ఆపై అంతకన్నా మించి ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. భారత్- అమెరికా, భారత్- రష్యా వీటి మధ్య గల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఎంతన్నది కూడా ఈ పరిస్థితుల్లో ఒక చర్చగా మారింది. ఆపై భారత్- రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుంటే వచ్చే లాభమేంటి? వాటిల్లే నష్టమేంటన్న ప్రశ్నతెరమీదకు వస్తోంది. ఎవరు అవునన్నా, కాదన్నా భారత్ రష్యాకన్నా, అమెరికాతోనే ఎక్కువ వ్యాపారం చేస్తున్నది. భారత్, యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 130 బిలియన్ డాలర్లకు పైమాట. ఇక భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 68 బిలియన్ డాలర్లు మాత్రమేనట. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే, అమెరికాకు భారత్ 86 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తుంది.. అదే అమెరికా భారత్ కి కేవలం 45 బిలియన్ డాలర్ల ఎగుమతి మాత్రమే చేస్తుంది. ఇదిలా ఉంటే రష్యా నుంచి మనం ఏటా 9 నుంచి 11 మిలియన్ బేరళ్ల ఆయిల్ గానీ కొనకుంటే.. 96 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతుంది. 2022 నాటి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వరకూ భారత్ రష్యా నుంచి 0. 2 శాతం మాత్రమే ఆయిల్ కొనుగోలు చేసేది. అదే రష్యా నాటో దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొనడం మొదలయ్యాక విపరీతమైన రాయితీలను ఇచ్చింది. ఈ రాయితీల కారణంగానే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పెంచింది. ఇప్పుడా కొనుగోళ్లు 35 నుంచి 40 శాతానికి చేరాయి. ఒక వేళ మూడో అతి పెద్ద చమురు దిగుమతి దారైన భారత్ గానీ అంతమేర ఆయిల్ రష్యా నుంచి కొనకుంటే ఆ మొత్తం ఇతర దేశాల మీద ఆధారపడ్డం వల్ల.. డిమాండ్ పెరిగి ప్రపంచ వ్యాప్తంగా అమాంతంగా ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదముంది. ఇదెంత విడమరచి చెప్పినా అమెరికాకి అర్ధం కావడం లేదు. అలాగని మీరు రష్యా నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోవడం లేదాని ట్రంప్ ని ఆయన వైట్ హౌస్ లోనే అడిగేశారు మీడియా వాళ్లు. ఆ విషయం తనకు తెలీదన్నారాయన. నిజానికి యూఎస్ రష్యా నుంచి ఎరువులు యురేనియం వంటి వాటిని 24 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటుంది. నిక్కీ హేలి వంటి వారు మరో ప్రశ్న కూడా సంధించారు.. మరి చైనా మాత్రం భారత్ కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం లేదా? అని నిలదీశారు. మరో విచిత్రమేంటంటే చైనాకన్నా భారత్ పైనే ట్రంప్ సుంకాలు ఎక్కువగా విధించారు. ట్రంప్ కి భారత్ అంటే ఎందుకంత కడుపు మంట అంటే.. ఆయనకి నోబుల్ శాంతి బహుమతి ప్రతిపాదన పాక్ చేయగా.. భారత్ మాత్రం ససేమిరా అంది. దానికి తోడు మా పాలన వైట్ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కావాలంటే పాకిస్తాన్ ని అక్కడి నుంచి పాలించుకోవచ్చని భారత్ తెగేసి చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్, యూఎస్ సంబంధాలు మెరుగుపడే దారేది? అంటే అందుకు తగిన సమాధానం దొరకడం లేదు. రష్యా నుంచి ఆయిల్ కొనడం మాత్రమే ట్రంప్ అభ్యంతరం కాదు. రష్యా, చైనాతో సమానంగా భారత్ అంతకంతకూ ఎదుగుతోంది. ఈ మూడు బ్రిక్స్ దేశాలూ కలిస్తే ఎక్కడ తమ అగ్ర నాయకత్వానికి ముప్పు ఏర్పడుతుందో అన్న ఆందోళన కారణంగా ట్రంప్ ఇలా భారత్ అంటేనే సుంకాలతో విరుచుకుపడుతున్నారని.. వారికి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు ఉద్యోగాలు ఇవ్వరాదని అంటున్నారని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. మరి చూడాలి... ఈ సుంకాల యుద్ధం క్లైమాక్స్ ఎలా ఉంటుందో?
http://www.teluguone.com/news/content/objections-of-trump-39-203758.html





