రెమిడీసీవీర్ సీసాల్లో సెలైన్ వాటర్! ఇంత దారుణమా?
Publish Date:Apr 30, 2021
Advertisement
దేశ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. తెలంగాణలోనూ రోజు రోజుకు కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ తో పాటు సీరియస్ పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్న రెమిడీసీవర్ ఇంజక్షన్లు దొరకడం లేదు. ఆక్సిజన్ అవసరమైన రోగులకు రెమిడీసీవీర్ ఇంజక్షన్ బాగా పని చేస్తుందని చెబుతున్నారు. దీంతో రెమిడీసీవీర్ ఇంజక్షన్ల కోసం రోగుల బంధువులు పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు ఎంటరయ్యారు. కరోనా కల్లోల సమయంలోనూ కాసుల కక్కుర్తితో నీచంగా వ్యవహరిస్తున్నారు. కరోనా రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుంటూ కొంతమంది ద్రోహులు వారి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. నిజామాబాద్ లో వాడిపడేసిన రెమిడీసీవీర్ ఇంజక్షన్ సీసాల్లో సెలైన్ వాటర్ ను ఎక్కించి అమ్మేసిన ఘటన కలకలం రేపింది.నిజామాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు బయలాజికల్ వేస్ట్ క్రింద పడేసిన సీసాల్లో సెలైన్‌ను నింపి అమ్మారు. ఒక్కోటి ముప్పైవేలకు కరోనా బాధితులకు అమ్మారు. అయితే తీరా వాటిని పరీశించిన వైద్యుడు నకిలీవని తేల్చడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులకు విషయం చేరడంతో రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.. నిజామాబాద్ లోనే కంచె చేనుమేస్తే అన్నచందంగా సర్కారు ఆసుపత్రిలో రేమిడేవిస్ ఇంజక్షన్లు పక్కదారి పట్టిస్తూ ఓ నర్సు అడ్డంగా దొరికిపోయింది. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సుగా పనిచేస్తున్న శ్రావణి.. ఆసుపత్రి నుంచి ఎంతో విలువైన రెండు రెమిడీసీవీర్ ఇంజక్షన్లను దొంగిలించి తన భర్త అరుణ్ అందించింది.. అరుణ్ వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్మకానికి పెట్టాడు.. నిఖిల్ సాయి హోటల్ వద్ద ఒక్కో డోస్ 25 వేల కు విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. భార్య భర్తలపై కేసు నమోదు చేశారు. ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మందులు అమ్మె ముఠాలు పేట్రేగిపోతున్నారు. శానిటైజర్ దగ్గర నుంచి రెమిడెసివర్ వరకు మొత్తం నకిలీవి తయారు చేస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలను అనువుగా మార్చుకొని అమాయకులను మోసం చేస్తున్నారు. వారి మాయలో పడి ప్రాణాన్ని కాపాడుకోవాలనే తొందరలో అడిగినంత డబ్బు కట్టి నకిలీవి కొంటున్నారు. తీరా మోసం జరిగిందని తెలిసి పోలీసులును ఆశ్రయిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/nurse-selling-remdsiver-injuction-inblock-market-39-114573.html





