తెలుగు ‘వాడి’ ప్రపంచానికి తెలిసిన రోజు
Publish Date:Jan 9, 2026
Advertisement
తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ ఈ మూడక్షరాలు.. ఒక సంచలనం. ఒక ప్రభంజనం. గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారంతా అన్న అని ఆత్మీ యంగా పిలుచుకునే ఎన్టీ రామారావు సినిమా, రాజకీయ రంగాలను శాసించారు.దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలు నిర్మించారు. మరెన్నో దర్శకత్వం వహించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయారు. సరిగ్గా 42 ఏళ్ల కిందట (1983 జనవరి 9) ఇదే రోజున ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే .. 1983 జనవరి 9 తెలుగు కీర్తిపతాక ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడిన రోజు. తెలుగు నేల పులకించిన రోజు. తెలుగు‘వాడి’ తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు. రాజకీయం జనం చెంతకు చేరిన రోజు. తెలుగువారిని చిన్న చూపు చూసిన కాంగ్రస్ పాలనకు రాష్ట్రంలో చరమ గీతం పాడిన రోజు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్టీఆర్ అచ్చమైన ప్రజల మనిషి. అందుకే ఆయన రాజభవన్ ఇరుకు గోడల మధ్య కాదు.. జనం సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల సమక్షంలో బహిరంగ మైదానంలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అదే ప్రథమం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు. హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం, ఆ మాటకొస్తే.. ప్రపంచ దేశాలలో తెలుగు వారు ఉన్న ప్రతి చోటా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారం తరువాత ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. ఉద్వేగ భరి తం. ఉత్తేజపూర్వకం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ ప్రజల కోసమే పని చేస్తానని ఆయన చేసిన ప్రకటన కేవలం ఊకదంపుడు ప్రకటన కాదని ఆయన తన పాలన ద్వారా చేతల్లో చూపారు. ప్రజాహితమే తన అభిమతమని అవిశ్రాంతంగా ప్రజాసంక్షేమం కోసమే పాటుపడ్డారు. అధి కారమంటే విలాసం. అధికారమంటే పెత్తనం అన్నట్లుగా సాగిన తీరును సమూలంగా మార్చేసి అధికారం అంటే బాధ్యత. అధికారమంటే జవాబుదారీ తనం. అధికారమంటే ప్రజా సేవ అని తెలిసొచ్చేలా చేశారు. తనను సినీరంగంలో మకుటం లేని మహారాజుగా నిలబెట్టిన మశిక్షణ, రుజు వర్తన, ,సమయపాలనలను ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోనూ కొనసాగించారు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నో సౌకర్యాలను ఆయన తృణప్రాయంగా త్యజించి నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా నిలిచారు. బడుగుబలహీన వర్గాలకు , అధకారంలో భాగస్వామ్యం కల్పించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు వంటి పథకాలతో జనం మనిషి అనిపించుకున్నారు. అందుకే జనం గుండెల్లో నిండుగా చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో (అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
http://www.teluguone.com/news/content/ntr-1st-time-swaorn-in-as-ap-cm-25-212276.html





