మన పెద్దనోట్ల సెగ దుబాయ్‌కీ తప్పలేదు
Publish Date:Dec 29, 2016
Advertisement
పెద్ద నోట్ల రద్దు వల్ల లాభపడింది..నష్టపోయింది ఎవరంటే బంగారు వ్యాపారులే. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్న కాసేపటికే..బడాబాబులు, నల్లకుబేరులు నగల దుకాణాలకు క్యూకట్టారు. దాచుకున్న కోట్లాది రూపాయల నల్లధనాన్ని బంగారం రూపంలో మార్చుకున్నారు. నవంబర్ 8వ తేదీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ నిర్థారించింది. కోట్లలో ఉన్న పెద్ద నోట్లతో పాటు నల్లధనాన్ని డిపాజిట్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన వీరంతా ప్రత్యామ్నాయంగా బంగారాన్ని ఎంచుకున్నారు. దీంతో కొద్ది రోజుల పాటు బంగారం వ్యాపారులు పండుగ చేసుకున్నారు. అయితే బంగారం కొనుగోళ్లతో పాటు గతంలో ఇళ్లలో దాచి ఉంచిన బంగారంపైనా కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పాటు నల్లకుబేరులతో పాటు నగల దుకాణాల యజమానుల నోటిలో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దానికి తోడు ఐటీ నిఘా ఎక్కువకావడంతో నల్లబాబులకు ఏం పాలుపోలేదు. ఈ దెబ్బతో బంగారం వైపు కన్నెత్తి చూడటానికే వణికిపోయారు. దీని ప్రభావంతో బులియన్ మార్కెట్ షట్ డౌన్ అయ్యింది. కొనుగోళ్లు, అమ్మకాలు లేక మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగే గోల్డ్ బిజినెస్ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఈ సంగతి పక్కన బెడితే ఏంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు..భారత్‌లో పెద్దనోట్ల రద్దు ఏడారి దేశం దుబాయ్‌పై పడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాతి నుంచి భారతీయ పర్యాటకులు దుబాయ్‌లోని జ్యూయలర్స్‌లోకి అడుగుపెట్టడం లేదట.. దీంతో అక్కడి చిన్న, పెద్ద దుకాణాల వ్యాపారం బాగానే తగ్గిపోయిందట. భారత్ కంటే దుబాయ్‌లో పసిడి ధర కాస్త తక్కువగా ఉండటమే కాకుండా కొత్త కొత్త డిజైన్లు దొరుకుతుండటంతో పర్యాటకులు, అక్కడ నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఆభరణాలు కొంటూ ఉంటారు. దుబాయ్‌కి వచ్చే పర్యాటకులు ఇక్కడ భారత కరెన్సీని ఎక్చేంజ్ చేసుకుని దానితో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే భారత్‌లో తీవ్ర కరెన్సీ కొరతను ఎదుర్కొంటుండటంతో ఎవరి పర్సుల్లోనూ నోట్ల కట్టలు కనిపించడం లేదు. ఈ ప్రభావం దుబాయ్ బులియన్ మార్కెట్‌ను దెబ్బ తీసింది. ముఖ్యంగా బంగారం వ్యాపారానికి పేరుగాంచిన గోల్డ్ సోక్, బుర్ దుబాయ్‌లో కస్టమర్ల సంఖ్య బాగా తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. వీలైనంత త్వరలో భారత్‌లో సంక్షోభం సద్దుమణగాలని వారు కోరుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/notes-ban-37-70704.html





