వైసీపీకి నేతలే కాదు.. క్యాడరూ దూరమే!.. ఇది జగన్ స్వయంకృతమే!
Publish Date:Sep 30, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాశాలు లేకుండా ఆ పార్టీ అధినేత అడుగులు పడుతున్నాయా? నాయకులు, కార్యకర్తలు పార్టీని వదిలి పారిపోయే పరిస్థితులను స్వయంగా సృష్టిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. పిడిక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా జగన్ తన తప్పిదాలను, తన వైఫల్యాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీకీ ఆపాదించి చేతులు దులిపేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. బూమరాంగ్ అవుతున్నాయి. వైసీపీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం బయటపడిన క్షణం నుంచీ జగన్ వ్యూహాలన్నీ భస్మాసుర హస్తాన్ని తలపింప చేసేలాగే ఉన్నాయి. ఈ వివాదం నుంచి బయటపడటం కోసం ఆయన ఎంచుకున్న ఎదురు దాడి వ్యూహం వైసీపీనీ, జగన్ ను నిండా ముంచేసింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడి కాగానే జగన్ కల్తీ జరిగితే జరిగింది.. కానీ దానికి బహిర్గతం చేయడం ఏమిటి? అంటూ ఎదురుదాడికి దిగారు. కల్తీ అబద్ధమని గట్టిగా చెప్పలేకపోయారు. జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష అనగానే దానికి కౌంటర్ గా తాను ప్రాయశ్చిత పూజలు అంటూ ప్రకటన చేశారు. తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుని ప్రాయశ్చిత పూజలు నిర్వహిస్తానని ప్రకటించి.. ఇందుకు షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. అయితే తిరుమల వేంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేష్ ఇవ్వడానికి మాత్రం ససేమిరా అన్నారు. తన తిరుమల పర్యటనను సైతం రద్దు చేసేసుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. జగన్ తన తీరుతో తమ రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టేశారని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇక పార్టీ క్యాడర్ మనో ధైర్యమైతే పాతాళానికి పడిపోయింది. జగన్ తన పర్యటనను తానే స్వయంగా రద్దు చేసుకుని ప్రభుత్వం అడ్డుకుందని ప్రజలను నమ్మించడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ప్రజల దాకా ఎందుకు తన తిరుమల పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ ఆయన చేసిన ఆరోపణలను సొంత పార్టీ నేతలూ, కార్యకర్తలే నమ్మడం లేదు. నిజంగానే ఒక వేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే పార్టీకి అంత కంటే కావలసిందేముందని, ఎందుకు అనుమతి ఇవ్వరంటూ జగన్ తిరుమల పర్యటనకు బయలు దేరి ఉండాల్సిందనీ శ్రేణులు అంటున్నాయి. అప్పుడు పోలీసులు అడ్డుకుని ఉంటే.. ప్రజలలో మంచి మైలేజ్ వచ్చి ఉండేది కదా అంటున్నారు. అలా కాకుండా అసలు జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటకుండానే ప్రభుత్వం అడ్డుకుందంటూ చేతులెత్తేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. అయినా ఓ వైపు ప్రభుత్వం జగన్ తిరుమల పర్యటనపై ఎలాంటి ఆంక్షలూ లేవని విస్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా పోలీస్ యాక్ట్ 30 ప్రకారం ఎవరో వైసీపీ కార్యకర్తకు ఇచ్చిన నోటీసును తనకు ఆపాదించుకుని జగన్ పిరికిపందలా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్నారు. అలా రద్దు చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి లేకపోవడం ఏ మాత్రం కారణం కాదని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని ఆ శ్రేణులు నమ్ముతున్నాయి. జగన్ డిక్లరేషన్ ఇవ్వరు అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నాయి. డిక్లరేషన్ ఇవ్వలేని జగన్ కు తిరుమలలో ప్రాయశ్చిత పూజలు నిర్వహించే అధికారం ఎక్కడిదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. మొత్తంగా ఓటమి తరువాత జగన్ పార్టీని నేతలు వీడుతూ వస్తున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ను నిరాకరించి పార్టీ కార్యకర్తలూ పారిపోయే పరిస్థితి జగన్ స్వయంగా తెచ్చుకున్నారు.
http://www.teluguone.com/news/content/not-only-leaders-cadre-also-leaving-ycp-39-185893.html





