హవ్వ! ఏబీవీకి నామమాత్రపు నామినేటెడ్ పోస్టా?
Publish Date:Feb 2, 2025
Advertisement
ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ఏబీ వెంకటేశ్వరరావు పేరు సుపరిచితమే. తెలుగుదేశం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. ఆ సమయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు ఏబీవీపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ ఫిర్యాదులతో ఈసీ ఆయన్ను బదిలీ చేసింది. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రావటం.. జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఏబీవీకి కష్టకాలం మొదలైంది. జగన్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఏబీవీపై తప్పుడు ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో రక్షణ, నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి జగన్ వర్సెస్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నట్లుగా ఆయన కోర్టుల్లో పోరాటం చేశారు. చివరికి ఏబీవెంటకేశ్వరరావు విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని అంతా భావించారు. వైసీపీ హయాంలో సస్పెన్షన్ లో ఉన్నకాలంలో ఆయనకు నిలిపివేసిన జీత భత్యాలన్నింటినీ ఇవ్వాలని ఇటీవల కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా నామినేటెడ్ పోస్టు కూడా ప్రకటించింది. అయితే, ఆ నామినేటెడ్ పోస్టు పట్ల ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనపై జగన్ కక్షపూరితంగా వ్యవహరించారు. తప్పుడు కేసులతో ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యహరించారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే న్యాయం జరుగుతుందని కూటమి నేతలు, ఆయన అభిమానులు భావించారు. కానీ, ఏడు నెలల తరువాత ఏబీకి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని, విచారణను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే వైసీపీ హయాంలో సస్పెన్షన్ లో ఉన్న కాలమంతా ఆన్ డ్యూటీగానే ప్రకటించి అప్పట్లో ఆయనకు నిలిపివేసిన జీత భత్యాలన్నింటినీ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొంచెం ఆలస్యంగానైనా ఏబీకి న్యాయం జరిగిందని అంతా భావించారు. ఇక కీలక పోస్టు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకుంటుందని అంతా అనుకున్నారు. అయితే ఆయనుకు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్టు ఇవ్వడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం, నిరసన వ్యక్తం అవుతోంది. ఈ పదవిపై ఏబీ వెంకటేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఆయన స్థాయికి తగిన పోస్టు ఇవ్వలేదన్నపరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వైసీపీ హయాంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఓ జడ్పీటీసీకి జగన్ మోహన్ రెడ్డి కట్టబెట్టారు. ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత అలాంటిది. ప్రభుత్వం ఏబీవీ అనుభవాన్ని సరిగా వాడుకోవడం లేదనీ, ఏదో మొక్కుబడి తంతుగా ఓ పదవి కట్టబెట్టి చేతులు దులిపేసుకుందని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏబీవీపై రెండు దఫాలుగా సస్పెన్షన్ వేటు పడింది. 2020 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకూ మొదటి సారి, రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకూ మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. అలా నాలుగేళ్లకుపైగా ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. మొత్తం ఐదేళ్ల పాటు ఆయనకు పోస్టింగ్ లేదు. అంతేకాదు.. ఆయన్ను డిస్మిస్ చేయాలనికూడా కేంద్రానికి జగన్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే కేంద్రం ఆ సిఫారసును పట్టించుకోలేదు. రిటైర్మెంట్ ముందురోజు కోర్టు ఉత్తర్వుల కారణంగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ చేపట్టి అదేరోజున ఆయన రిటైర్ అయ్యారు. అయితే ఐదేళ్ల పాటు ఆయన పడిన బాధలు అలాగే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలస్యంగానైనా ఆయనకు ఉపశమనం లభించింది అనుకునేలోగానే ఓ అప్రాధాన్య పోస్టును ఆయనకు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం కూడా అవమానించిందని అంటున్నారు. . అయితే, ఏబీ వెంకటేశ్వరరావు సీనియర్ పోలీస్ అధికారి. ఆయన నిజాయితీగా పనిచేసే అధికారిగా ప్రజల మన్ననలు పొందిన అధికారి. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో అనుభవం కలిగిన ఏబీవీ పట్ల జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి ఐదు సంవత్సరాలు ఖాకీ యూనిఫాంకు దూరం చేశారు. తనపై కుట్రలో అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ పాత్ర కూడా ఉందని గతంలో ఏబీవీ పలు సార్లు ప్రస్తావించారు. కచ్చితంగా ప్రభుత్వం మారుతుంది.. రోజులన్నీ ఇలానే ఉండవు.. తప్పుడు డాక్యుమెంట్లు, ప్రాబికేటెడ్ డాక్యూమెంట్లు తయారు చేసిన అధికారిని ఈ దేశంలో ఎక్కడున్నా సరే చొక్కా కాలర్ పట్టుకొని తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లో సవాల్ చేశారు. అటువంటి ఏబీ ఏబీ వెంకటేశ్వరరావు పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఏబీవీ లాంటి సుదీర్ఘ అనుభవం కలిగిన అధికారిని ఇంటెలిజెన్స్ విభాగంలోనో, పోలీస్ శాఖలోనో సలహాదారుడిగా నియమించి ఉంటే బాగుండేదన్న భావన కూటమిలోని నేతల నుంచి సైతం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏబీవీకి కీలక పదవి అప్పగించాలని కూటమి నేతలు పలువురు బాహాటంగానే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయనకు ప్రజల నుంచికూడా మద్దతు ఉంది. అలాంటి వ్యక్తిని నామమాత్రమైన నామినేటెడ్ పదవికి ఎంపిక చేయడం పట్ల ఏబీవీ అభిమానులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏబీవీ సైతం కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవిని తీసుకునేందుకు సుముఖంగా లేరని వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/nominal-nominated-post-to-abv-25-192239.html





