తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక.. సీఎం విజయ్ ఫ్రెండ్ రాఘవ లారెన్స్ కు నో టికెట్?
Publish Date:Jul 1, 2026
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలలో కొత్త ఒరవడి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ పెరంబదూర్, తిరుచిరాపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల నుంచీ విజయం సాధించారు. దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ తాజాగా తిరుచిరాపల్లిలో ఏర్పాటు చేసిన కృతజ్ణతా సభలో చేసిన ప్రకటన ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తిరుచిరాపల్లి ఉప ఎన్నికలో టీవీకే తరఫున స్థానిక అభ్యర్థి మాత్రమే పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని ఆయన విస్పష్టంగా చెప్పారు. పార్టీ అధినేత స్థానిక నేతకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంతో, గ్రౌండ్ లెవెల్‌లో టీవీకే క్యాడర్ మరియు స్థానిక కార్యకర్తలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతు ఉండటంతో ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ బై-ఎలక్షన్ ద్వారా టీవీకే ప్రభావాన్ని దెబ్బతీయాలని డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. ఆ వ్యూహాలకు చెక్ పెట్టే దిశగా విజయ్ ముందుకు సాగుతున్నారనడానికి లారెన్స్ కు టికెట్ నిరాకరించి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక నేతకే పార్టీ టికెట్ ఇస్తానని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ విజయ్ అవినీతి రహిత పాలన, సామాజిక న్యాయంపై ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నారన్న భావన రాజకీయవర్గాలలో సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే.. తిరుచ్చిలో స్థానికునికే పార్టీ టికెట్ ప్రకటన ఈ ఉప ఎన్నికలో టీవీకే విజయాన్ని దాదాపు ఖరారు చేసేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/no-ticket-for-cm-vijays-friend-raghava-lawrence-39-224720.html





