బీఆర్ఎస్ పిలుపునకు తెలంగాణ సమాజం స్పందించలేదా?
Publish Date:Mar 15, 2025
Advertisement
బీఆర్ఎస్ ను తెలంగాణ సమాజం పెద్ద సీరియస్ గా తీసుకోలేదా?.. ఆ పార్టీ ఇచ్చిన నిరసన పిలుపును పట్టించుకోలేదా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేస్తున్న విమర్శలను, ప్రభుత్వ విధానాలపై చేస్తున్న పోరాటాలనూ తెలంగాణ సమాజం పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇందుకు ఉదాహరణలుగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టైనప్పుడు ప్రజల నుంచి ఏ మాత్రం వ్యతిరేకత రాని విషయాన్ని గుర్తు చేయడమే కాకుండా, ఆ తరువాత ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరవ్వడాన్ని కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇక తాజాగా అసెంబ్లీ నుంచి ప్రస్తుత బడ్జెట్ సెషన్ పూర్తయ్యే వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి నిరసనగా గురువారం (మార్చి 13)న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా శుక్రవారం (మార్చి 14) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరగలేదు. అధవా కొన్ని చోట్ల జరిగినా జనం భాగస్వామ్యం కనిపించలేదు. అతి తక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు మాత్రమే మొక్కబడిగా నిరసన తెలిపారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వంటి నేతలు కూడా పార్టీ ఇచ్చిన నిరసన పిలుపు కంటే హోలీ వేడుకలకే ప్రాధాన్యత ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/no-response-for--brs-protest-call-39-194419.html





