హైకోర్టులో విడదల రజినికి లభించని ఊరట
Publish Date:Mar 27, 2025
Advertisement
వైసీపీ నాయకురాలు, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజినికి హైకోర్టులో ఊరట లభించలేదు. అవినీతి కేసులో విడదల రజని దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ పై గురువారం (మార్చి 27) విచరణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. బెయిలుపై కనీసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న విడదల రజని విజ్ణప్తిని తోసిపుచ్చింది. మాజీ మంత్రి విడదల రజని, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరో ఇద్దరిపై ఏసీబీ అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో మంత్రి హోదాలో విడదల రజిని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా విడదల రజిని, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారిగా పని చేసిన పల్లె జాషువా, రజిని సమీప బంధువు విడదల గోపి, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణులు సహ నిందితులుగా ఉన్నారు.
http://www.teluguone.com/news/content/no-respite-to-vidadala-rajani-in-high-court-25-195100.html





