బీజేపీ-సంఘ్ పరివార్ మధ్య అగాధం.. మోహన్ భగవత్ శాంతి మంత్రం సంకేతమదేనా?
Publish Date:Dec 22, 2024
Advertisement
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తన వ్యాఖ్యల ద్వారా సంఘ్ పరివార్, బీజేపీ మధ్య అగాధం ఇంకా పూడలేదన్న సంకేతాలు ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. తాజాగా మోహన్ భగవత్ మసీదు, మందిరం వివాదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రవచించడం బీజేపీ,సంఘ్ పరివార్ మధ్య సంబంధాలు ఇంకా బలపడలేదనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ముందు సంఘ్ పరివార్, బీజేపీ అగ్రనాయకత్వం మధ్య అగాధం ఉదన్న విషయం ప్రస్ఫుటమైంది. బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు అప్పట్లో పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు వారి మధ్య సామరస్యం లేదని విస్పష్టంగా తేల్చేశాయి. ఇక తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా సంఘ్ పరివార్, బీజేపీ నేతలు పరస్పర అవగాహనతో, సామరస్యంగా కలిసి పని చేశారన్న భావన కలిగింది. అయితే అదేమీ వాస్తవం కాదని అకస్మాత్తుగా భగవత్ చేసిన మసీదు, మందిరం వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ చేసిన శాంతి ప్రకటన బీజేపీ అగ్రనాయకత్వం విధానాల పట్ల సంఘ్ పరివార్ అసంతృప్తితో ఉందన్న భావన కలిగించేలా ఉంది. బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మైనార్టీలపై తమ వ్యాఖ్యల ద్వారా విషం చిమ్ముతున్నారని, ఫలితంగా దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారనీ మోహన్ భగవత్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా హెచ్చరించినట్లయింది. భారత దేశమంటేనే పరమతసహనం. అదే కొనసాగాలి. భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం. అన్ని మతాల వారు ఎన్నో వందల సంవత్సరాలుగా కలసి మెలసి బతుకుతున్నారు. మసీదు, మందిరం వివాదాలు ఇకపై కొనసాగనివ్వరాదు అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ ఆరంభమైంది. శ్రీరాముడు హిందువుల ఆరాధ్యుడు. రామమందిర నిర్మాణం హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కనుక మందిర నిర్మాణం వారి నమ్మడానికి ప్రతీక అన్నారు. అలాగని ప్రతిచోటా కొత్త వివాదాలు రెకెత్తించడం సబబుకాదని మోహన్ భగవత్ కుండబద్దలు కొట్టారు. ప్రతి మతానికి నమ్మకాలు, దైవం.సంస్కృతి ఉంటాయని వాటిని గౌరవించి తీరాల్సిందేననీ మోహన్ భగవత్ చెప్పారు. దేశంలోని ప్రతిపౌరునికీ తమకు నచ్చిన దైవాన్ని ఆరాధించే హక్కు ఉందన్నారు. మహారాష్ట్ర లోని విశ్వగురు భారత్, ఉత్తరప్రదేశ్లోని షాజహాన్ మసీదు, రాజస్తాన్ లోని అజ్మేర్ షరీఫ్ దర్గా ల వివాదాలు ప్రస్తావించి వాటి వివాదంలోకి లాగడాన్ని తప్పుపట్టారు. ఇకపై కొత్త వివాదాలకు అవకాశాలు ఇవ్వరాదని బీజేపీకి హితవు చెప్పారు. దేశంలో అందరూ కలసిమెలసి జీవిస్తున్నారని,అలాగే శాంతియుతంగా జీవించడమే అసలైన గుర్తింపు అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని మెలగాలని సూచించారు. జరిగిన తప్పులు మరలా జరగకుండా తగిన జాగర్తలు తీసుకుని సర్దుకుపోవడం వల్ల ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర మతాల దైవాలను అవమానించడం మన సంస్కృతి కాదన్నారు. ఏ దేశంలో నైనా మెజార్టీలూ,మైనార్టీలు ఉంటారని, వారి మధ్య విభేదాలు రాకూడదన్నారు. ప్రపంచ శాంతి కోసం భారత్ ప్రకటనలు,మధ్యవర్తిత్వం జరుగుతున్నా యుద్ధాలు ఆగడం లేదు.భారత్ లో మైనార్టీల అణచివేత జరుగుతోందన్న ప్రచారం ఉందనడం ద్వారా మోహన్ భగవత్ బీజేపీకి ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారు. ఇకపై మసీదు శిధిలాల్లో మందిరం అనే వివాదాలను తెచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని సూచించారు. సంఘ్ పరివార్, బీజేపీ మధ్య సంబంధాలు గత కొంతకాలంగా సరిలేవని,అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మేజార్టీ రాలేదన్న వాదనకు బలం చేకూర్చేవిగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఏదిఏమైనా భగవత్ చెప్పిన విషయం అక్షర సత్యమనడంలో సందేహం లేదు. దేశంలో పరమత సహనంతో అందరూ కలసిమెలసి బ్రతకాలన్న ఆయన సూచన శిరోధార్యం. హిందూత్వ అతివాదులు ఆయన వ్యాఖ్యలను ఔదాల్చి వివాదాలకు స్వస్థి పలికితే భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
http://www.teluguone.com/news/content/no-hormony-between-sangh-pariwar-and-bjp-25-190184.html





