తగ్గేదేలే.. ఎవరొచ్చినా.. రాకున్నా నా దారి జాతీయ రాజకీయాల వైపే!
Publish Date:Jul 11, 2022
Advertisement
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తగ్గట్లే.. తగ్గేదే లే అంటూ పుష్పలా ముందుకే సాగుతున్నారు. ఎవరు కలిసి వచ్చినా, రాకున్నా తన అడుగు ముందుకేనని స్పష్టం చేస్తున్నారు. అంతే కాదు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసన మోడీ ప్రధాని కాగా లేనిది.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న నేను ప్రధాని ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్ ను అభివృద్ధి చేసిన దాని కన్నా వంద రెట్లు తాను తెలంగాణను ప్రగతి పథంలో నడిపించానని చెప్పుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఎనిమిదేళ్ల కాలంలోనే దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రాలలో ఒకటిగా నిలిపిన తనకు.. దేశాన్ని ఎలా ముందుకు నడపాలో మోడీ కాంటే బాగా తెలుసునని అంటున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైన రోజుల మీడియా సమావేశంలో మోడీకి ప్రశ్నలూ సంధించి వాటికి సమాధానాలు చెప్పమని సవాల్ చేసి.. ప్రధాని ప్రసంగానికి అజెండా నిర్ణయించేశానని చెప్పుకున్న కేసీఆర్.. ఆ తరువాత మోడీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావనే తీసుకురాకపోవడంతో దిగాలు పడ్డారు. అందుకే బీజేపీ జాతీయ కార్గవర్గ సమావేశాలు ముగిసిన వారం రోజుల తరువాత తనను తాను కూడదీసుకుని మరోసారి మోడీ పాలనపై ధ్వజమెత్తడానికి మీడియా ముందుకు వచ్చారు. ఒక వైపు రాష్ట్రం కుండపోత వర్షాలతో అతలాకుతలమై ఉన్న సమయంలో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షా సమావేశాన్ని క్లుప్తంగా ముగించేసిన కేసీఆర్.. కేంద్రంపై, మోడీ పాలనపై ధ్వజమెత్తేందుకు మీడియా సమావేశంలో ఎక్కువ సమయమే తీసుకున్నారు. బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడమేనని ఉద్ఘాటించారు. మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జరగిన బహిరంగ సభలో తానడిగి ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయారని నిందించారు. మోడీ ప్రసంగం పూర్తయిన వారం రోజుల తరువాత కేసీఆర్ తాను మోడీకి సంధించిన ప్రశ్నలు కొత్తవేమీ కాదని వెల్లడించారు. 2014 ఎన్నికలకు ముందు మోడీ అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ను ఏ ప్రశ్నలైతే అడిగారో వాటినే తాను మోడీని అడిగానని అసలు రహస్యం చెప్పేశారు. తన జాతీయ అజెండా కొత్తదేమీ కాదనీ.. ఎనిమిదేళ్ల నాడు యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మోడీ ఏ అజెండానైతే ప్రజల ముందుకు తీసుకువచ్చారో అదే అజెండాతో తాను మోడీని ఎదుర్కొంటానని చెప్పారు. ఈ సందర్భంగా రూపాయి పతనంపై మోడీ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శల వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించి చూపారు. దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ప్రత్యర్ధులపై దాడులకు ఉపయోగించుకుంటున్నారనీ.. అలా వారిని బెదరించి బీజేపీలో చేర్చుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రప్రభుత్వాలను కూల్చేయడమే కేంద్రం పాలనా తీరుగా మారిపోయిందన్నారు. సీబీఐ కేసులు ఎదుర్కొని.. ఆ తర్వాత బీజేపీలో చేరి కేసుల ఊసే లేకుండా తిరుగుతున్న నేతల జాబితాను ఈ సందర్బంగా ఆయన బయటపెట్టారు. ప్రధానంగా సుజనా చౌదరి పేరును పలు మార్లు ఉదహరించారు. ప్రధాని మేకిన్ ఇండియా అట్టర్ ప్లాప్ అని విమర్శలు గుప్పించారు. పతంగుల మాంజా నుంచి ప్రతిదీ మేడిన్ చైనాయే అని ఎద్దేవా చేశారు. దేశానికి పాకిస్థాన్ కన్నా చైనాతోనే ప్రమాదం ఎక్కువ అని తనతో పలువురు మాజీ మేజర్లు, లెఫ్టినెంట్ జనరళ్లు చెప్పారనీ, అటువంటి చైనా సరిమద్దుల్లో మోడీ సర్కార్ దేశ భక్తి పేరిట ఆర్మీతో ప్రయోగాలు చేస్తోందని ఆరోపించారు. అగ్నిపథ్ అనేది ఒక పనికి మాలిన పథకమని చెప్పారు. జవాన్లకు శిక్షణ ఇవ్వడానికే ఆరేళ్లు పడుతుందన్నారు. అటువంటి శిక్షణ లేకుండా కేవలం నాలుగేళ్లలో జవాన్ల కెరీర్ పూర్తి చేసేయడమంటే ఆర్మీ సామర్థ్యాన్ని నీరుగార్చడమేనని దుయ్యబట్టారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోడీ వారి బతుకులను ఆగంఆగం చేశారని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు రెండు రోజుల పాటు రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని రెండు రోజుల పాటు కేసీఆర్ చర్చించారు. అంతే కాకుండా ఆయన మాటలను బట్టి ఆర్మీ మాజీ మేయర్లు, లెఫ్టినెంట్ జనరళ్లతో కూడా ఆయన చర్చించారని అవగతమౌతోంది. మొత్తం మీద కేసీఆర్ బీజేపీపై విసుర్లు, విమర్శలతో మరో సారి రాజకీయ చర్చలకు తనను తాను కేంద్ర బిందువుగా చేసుకోగలిగారు.
http://www.teluguone.com/news/content/no-back-step-kacr-says-his-target-is-national-politics-25-139436.html





