ఏపీలో రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్
Publish Date:May 6, 2025
Advertisement
ఏపీలో రేషన్ కార్డులు లేని వారికి కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి (మే 7) నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీంతో పాటు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునేందుకు కూడా వీలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డులలో సభ్యుల చేరిక, తొలగింపు, చిరునామా మార్పులు, కార్డుల విభజన వంటి సవరణలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులలో మార్పుల నిమిత్తం ఇప్పటికే 3.28 లక్షల దరఖాస్తులు అందాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, తగిన మార్పులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా గత ఆరు నెలల రేషన్ తీసుకున్న వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల తెలియజేశారు. అర్హులైన పౌరులు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ నెల నుంచి కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 95 శాతం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారు కార్డుల్లో మార్పుల కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/new-ration-cards-25-197590.html





