మిస్ వరల్డ్ పోటీలకు ఉచిత ఎంట్రీ పాసులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Publish Date:May 6, 2025
Advertisement
హైదరాబాద్‌లో రేపటి నుంచి ప్రారంభమయ్యే 72వ మిస్ వరల్డ్-2025 పోటీలకు కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను అందించనున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ ప్రకటించింది. టూరిజం శాఖ అధికారిక అధికారిక వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఎంపిక చేసిన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని అధికారులు తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు https://tourism.telangana.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలు జరగనున్నాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన సుందరీమణులు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను అందించనున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ పేర్కొంది చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్)లో 'మిస్ వరల్డ్-2025' పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్‌తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. సౌత్ జోన్ పోలీసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టారు. చార్మినార్ చుట్టుపక్కల ఉన్న అన్నిరకాల తోపుడుబండ్ల దుకాణాలను తొలగిస్తున్నారు. రెండు రోజుల క్రితం చిరు వ్యాపారులతో సమావేశమైన పోలీసు అధికారులు, పోటీలు ముగిసే వరకు దుకాణాలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో చార్మినార్ వద్ద వ్యాపారులు ఈ రోజు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పాతబస్తీలోని ఇతర ప్రాంతాలలో కూడా పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/miss-world-2025-25-197592.html





