కేసీఆర్ వర్సెస్ కేటీఆర్.. తెరాసలో కొత్త సమస్య!
Publish Date:May 18, 2022
Advertisement
తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే ఏదో గ్యాప్ వారికి ఊపిరి సలపనీయడంలేదా? మొత్తంగా టీఆర్ఎస్ లో పైకి కనిపించని కల్లోలం అధినేతను కలవరపెడుతోందా? అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఇందుకు వారు బుధవారం పట్టణ ప్రగతిపై జరిగిన సమీక్షకు మంత్రి కేటీఆర్ గైర్హాజర్ కావడమే నిదర్శనంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 16 రోజుల పాటు పామ్ హౌస్ లో దాదాపు అజ్ణాత వాసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు ఆ అజ్ణాత వాసాన్ని వీడి సోమవారం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. 18 నుంచి వరుసగా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మొదటిగా ప్రగతి భవన్‌లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు. కీలకమైన ఈ సమావేశానికి సంబంధిత మంత్రి, కేసీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) గైర్హాజరయ్యారు. కేటీఆర్ గైర్హాజరీయే రాజకీయ వర్గాలలో పలు చర్చోపచర్చలకు తెరతీసింది. కేటీఆర్ గైర్హాజరీకి ఆయన లండన్ పర్యటనలో ఉండటమే కారణమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాలలో మాత్రం భిన్న కథనాలు వినవస్తున్నాయి. ఇటీవలి కాలంలో తండ్రీ కొడుకులిద్దరూ ముఖాముఖి ఎదురు పడిన సందర్భాలు లేకపోవడం.. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు వచ్చిన తెల్లారే కేటీఆర్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లడంపై రాజకీయ వర్గాలలో పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కేసీఆర్ ఫాం హౌస్ లో ఉన్న 16 రోజులూ కేటీఆర్ క్షణం తీరిక లేకుండా వరుస కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో బిజీగా ఉండటం, నిత్యం జనంలో ఉంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ప్రగతిభవన్ కు చేరుకున్న తెల్లారే విదేశీ పర్యటనకు వెళ్లడం అనుమానాలకు తావిస్తున్నదంటున్నారు. తాను జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తానంటూ ఇటీవలి కాలంలో కేసీఆర్ తరచూ చెబుతుండడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. సీఎం పీఠంపై కేటీఆర్ ను కూర్చోబెట్టాలన్న ప్రణాళిక అమలులో కేసీఆర్ చేస్తున్న తాత్సరంపై తనయుడు కేటీఆర్ అసంతృప్తితో ఉన్నారనీ, అందుకే తండ్రికి ఎదురు పడడం లేదనీ అంటున్నారు. ఇటీవలి కాలంలో ఇరువురూ కలిసి ఒకే వేదిక పంచుకున్న దాఖలాలు కూడా లేవనీ కారణం ఇదే అయి ఉండొచ్చనీ అంటున్నారు. లేకపోతే కీలకమైన సమావేశానికి హాజరు కాకుండా సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి కూడా లండన్ పర్యటనకు ఎలా వెళతారని వారు ప్రశ్నిస్తున్నారు. మామూలుగా అయితే లండన్ పర్యటనను వాయిదా వేసుకుని ఉండేవారనీ, అలా చేయకుండా పెద్దగా ప్రాముఖ్యత లేని పర్యటనకే మొగ్గు చూపి, కీలకమైన సమీక్షా సమావేశానికి డుమ్మా కట్టడంతోనే ఏదో ఇబ్బంది, గ్యాప్ ఉందన్న విషయం స్పష్టమౌతోందని విశ్లేషణలు చేస్తున్నారు. దాదాపు 16 రోజుల పాటు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండిపోవడం, రాష్ట్ర రాజకీయాలపై, ఆయన జాతీయ ఎజెండాపై కూడా ఒక్క మాట మాట్లాడకుండా మౌన వ్రతం పాటించడం వెనుక కారణం తనయుడితో గ్యాపేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనయుడిని బుజ్జగించేందుకే అంతకు ముందు కూడా తన దృష్టి అంతా జాతీయ రాజకీయాలపైనే అంటూ లీకులిచ్చారని చెబుతున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ఎర్రవల్లి పాంహౌస్ నుంచి బయటకు వచ్చిన తెల్లారే కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న సంకేతాన్ని ఇస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అలాగే రాజ్యసభకు తెరాస అభ్యర్థుల ఎంపిక సమయంలో కేటీఆర్ అందుబాటులో లేకపోవడం కూడా పార్టీలో ఏదో ఇబ్బందికరమైన వాతావరణం ఉందనడానికి సంకేతమని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/new-problem-in-trs-25-136081.html





