ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు..? బీఆర్ఎస్, వైసీపీ సంకటం
Publish Date:Aug 19, 2025
Advertisement
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత …. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు ఎదురవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున సి.పి. రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి తెలంగాణా కు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ, బీఆర్ఎస్ ఏ కూటమిలోనూ లేవు. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ కూటమికి మద్ధతు ఇవ్వాలనే విషయంలో ఈ రెండు పార్టీలకు సంకట స్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వలేని పరిస్థితి. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటుందా? ఎవరికైనా అండగా నిలుస్తుందా వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ పార్టీది కూడా సరిగ్గా ఇదే పరిస్థితి. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో ఎన్డీయే కూటమికి అండగా నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జగన్ రాష్ట్ర వ్యవహారాల్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ పట్ల ఎటువంటి వ్యతిరేకతా వ్యక్తం చేయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అయితే తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తే రాష్ట్రంలో కయ్యం… కేంద్రంలో వియ్యం అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే తనపై ఉన్న కేసుల విషయంలో బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయంతో ఉన్నారు. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నికలు వైసీపీ, బీఆర్ఎస్ లకు తలనొప్పిగా మారుతున్నాయి.
http://www.teluguone.com/news/content/new-headache-to-brs-and-ycp-25-204554.html





