పులివెందులలో రిగ్గింగ్ అంటూ అంబటి ఫేక్ వీడియో.. నెటిజన్ల ట్రోలింగ్ మామూలుగా లేదుగా
Publish Date:Aug 16, 2025
Advertisement
అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు వైసీపీకి అలవాటే. దొరికిపోయిన ప్రతిసారీ నెటిజన్ల ట్రోలింగ్ కూడా ఆ పార్టీ నేతలకు కొత్తేం కాదు. అధికారంలో ఉన్నప్పటి నుంచీ కూడా వైసీపీ చేస్తున్నది ఇదే. వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసిన అరాచకాలు, దుష్ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోతో చెలరేగిన తీరు సామాన్య జనానికి కూడా వెగటు పుట్టించింది. గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఈ తీరు కూడా ఒక కారణమనడంలో సందేహం లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయి, కనీసం విపక్ష హోదా లేని పరిస్థితుల్లో కూడా మళ్లీ పుంజుకోవాలంటూ ఫేక్ తీరు శరణ్యమని వైసీపీ భావిస్తున్నట్లు ఉంది. అయినా గత ఎన్నికలలో ఓటమి కంటే ఘోరమైన పరాజయం ఆ పార్టీకీ, ఆ పార్టీ అధినేత జగన్ కీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎదురైంది. సహజంగానే ఈ ఓటమి వైసీపీ అధినేత జగన్ సహా.. ఆ పార్టీ నేతలు, శ్రేణుల నైతిక స్థైర్యం పాతాళానికి పడిపోయింది. ఓటమిని జీర్ణించుకోలేక కక్కలేకా, మింగలేకా అన్నట్లుగా ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఉంది. రిగ్గింగు, అరాచకాలు అంటూ అధికార తెలుగుదేశం కూటమిపై విమర్శలు గుప్పిస్తోంది. కానీ కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా పులివెందుల జడ్పీటీసీలో ఎదురైన ఓటమికి ఏం చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా పులివెందులలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ, తన ఆరోపణలకు రుజువిదిగో అంటే ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే ఆయన ఇలా ఆ వీడియో పోస్టు చేసి పులివెందుల రిగ్గింగ్ కు సాక్ష్యం అన్నారో.. ఆ క్షణం నుంచీ నెటిజనులు అంబటిపై ఓ రెంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంబటిగారూ పులివెందులలో పోలింగ్ జరిగితే.. పశ్చిమబెంగాల్ లో రిగ్గింగు అంటారేంటండీ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగుకు రుజువిదుగో, తెలుగుదేశం పులివెందుల జడ్పీటీసీ ఎన ఉప ఎన్నికలో అక్రమాలకు పాల్పడిందనడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా అంటూ అంబటి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఓ ఫేక్ వీడియో. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఉపయోగించిన గులాబి రంగు బ్యాటెల్ పత్రాలు. కానీ అంబటి షేర్ చేసిన వీడియోలో పసుపు రంగు బ్యాటెల్ పత్రాలు కనిపించాయి. తెలుగుదేశం జెండా రంగు పసుపు కదా.. అంతా నమ్మేస్తారని భ్రమించినట్లున్నారు అంబటి. ఆ భ్రమలు పటాపంచలైపోవడమే కాదు..పులివెందులలో ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందనీ, అక్రమాలకు రుజువులు చూపడం చేతకాకే నకిలీలపై పడ్డారని పరిశీలకులు అంటున్నారు.
పశ్చిమ బెంగాల్ లో గతంలో ఎప్పుడో జరిగిన పోలింగ్ కు సంబంధించిన వీడియో.. దానిని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిందేనని నమ్మబలుకుతూ అంబటి రెచ్చిపోయారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఆయన బండారం బయటపడిపోయి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురయ్యారు పాపం. ఇంతకీ అంబటి నకిలీ గుట్టు ఎలా బయటపడిందో తెలుసా?
http://www.teluguone.com/news/content/netizens-troll-ambati-on-fake-video-39-204363.html





