ఒక్కరోజులో 2.5 లక్షల కేసులు.. కుమ్మేస్తున్న కరోనా..
Publish Date:Jan 13, 2022
Advertisement
భారతదేశంలో కరోనా మహమ్మారి జడలు విప్పి మరీ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన లెక్కల ప్రకారం 24 గంటల వ్యవధిలో రెండున్నర లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ కేసులు కూడా 5,488 నమోదయ్యాయి. కరోనా ధాటికి దేశంలో మరో 380 మంది బలైపోయారు. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 84,825 మంది కోలుకున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 18 లక్షల మంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 2,47,417 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకు ముందు రోజు కంటే 27 శాతం నమోదయ్యాయి. కరోనా నుంచి రికవరీ రేటు 95.59 శాతానికి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11 లక్షల 17వేల 531కు చేరుకుంది. కరోనా మహమ్మారికి ఇంత వరకూ దేశ వ్యాప్తంగా 3 కోట్ల 63 లక్షల 17 వేల 927 మంది బలైపోయారు. భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్క రోజులో 85 లక్షల, 26 వేల 240 డోసుల టీకాలు ప్రజలకు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతోంది. గత 24 గంటల్లో 31 లక్షల, 45 వేల, 916 మందికి కరోనా వైరస్ సోకింది. ఒక్క రోజులో 8 వేల 32 మంది మరణించారు.
http://www.teluguone.com/news/content/near-to-2-lakhs-corona-cases-in-india-with-in-24-hours-25-130131.html





