మోడీ ప్రభంజనంతో దిక్కుతోచని కాంగ్రెస్ పార్టీ
Publish Date:Oct 2, 2013
Advertisement
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ సుడిగాలిలా దేశాన్నిచుట్టేస్తూ మోడీ చేస్తున్న ప్రసంగాలతో దేశప్రజలు, ముఖ్యంగా యువత చాలా ప్రభావితులవుతున్నారు. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజపేయికి ఎంత ఆదరణ ఉండేదో, నేడు మళ్ళీ బీజేపీలో మోడీకి అంత ఆదరణ కనబడుతుండటంతో 2014ఎన్నికల తరువాత మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ అగ్ర నేతలలో కూడా ఇప్పుడు నమ్మకం ఏర్పడుతోంది. అందువలన ఇంతవరకు పార్టీలో ఆయనపట్ల ఉన్న వ్యతిరేఖ భావనలు కూడా క్రమంగా సమసిపోతున్నాయి. భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశ్యించి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ స్పందించకపోయినా, మోడీ “మా దేశ ప్రధానిని ఏమయినా అంటే కబడ్దార్” అంటూ వెంటనే తీవ్రంగా హెచ్చరించడంతో మోడీపట్ల ప్రజలలో మరింత అభిమానం పెరిగింది. తమ పార్టీకి చెందిన ప్రధానిని మోడీ వెనకేసుకు వస్తూనే, మరోపక్క అయన అసమర్దుడని విమర్శిస్తుంటే, కాంగ్రెస్ మోడీని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక తికమక పడుతోంది. పైగా మోడీ వాక్చాతుర్యం, ఆయన మాటలలో ప్రజ్వలించే దేశభక్తి కాంగ్రెస్ నేతలెవరిలో లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి దిగులు పుట్టిస్తోంది. అయితే ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కాక, తను నిర్దేశించుకొన్న సమున్నత లక్ష్యాల గురించి కూడా వివరిస్తూ, అందులో తాము కూడా భాగస్వాములమేననే భావన ప్రజలలో కలిగిస్తూ అన్ని వర్గాల ప్రజలను మమేకం చేసుకుపోతున్నారు. మానవ వనరులకు కొదవలేని మన దేశంలో దానిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవచ్చునో ఆయన చెపుతుంటే యువత ఆయనకి జేజేలు పలుకుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆయన విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ, ప్రజలు ఎంత మాత్రం నమ్మని ఆహార భద్రత, భూసేకరణ చట్టం, నగదు బదిలీ పధకం వంటివి వల్లెవేస్తూ ఉన్న నమ్మకం కూడా పోగొట్టుకొంటోంది. ఇటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నకాంగ్రెస్ పార్టీ ఆయనను గుజరాత్ అల్లర్లతో, నఖిలీ ఎన్కౌంటర్ కేసులతో గట్టిగా ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దానిపై కూడా మోడీ తనదయిన శైలిలో స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తన చేతిలో ఉన్న సీబీఐ, రా, ఈడీ, ఆధాయశాఖ మరి దేనిని తనమీద ప్రయోగించినా తానూ బయపడేది లేదు, లొంగేదీ లేదని చెప్పడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళకి ముందే బంధం వేసారు. ఇప్పుడు ఆయనపై కాంగ్రెస్ వీటిలో ఏ ఒక్క శాఖను ఉసిగొల్పినా, ప్రజలకు అయన కాంగ్రెస్-సీబీఐ బంధం గురించి చెప్పినవన్నీ నిజమని మరింత నమ్మకం కలుగుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలిగి ప్రమాదం ఉంది. బహుశః ఈ సారికి కాంగ్రెస్ పార్టీ కూడా ‘నమో నమో’ అనుకొంటూ పక్కకు తొలగి ఆయనకు దారీయక తప్పదేమో?
http://www.teluguone.com/news/content/narendra-modi-39-26297.html





