అక్టోబర్ లోనే స్థానిక ఎన్నికలు: క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్.!
Publish Date:Sep 23, 2026
Advertisement
ఏపీ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్ర రాజకీయాలలో స్థానిక ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు. ఎన్నికలు వాయిదా పడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదనీ.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అక్కర్లేదని తేల్చిచెప్పారు. మంత్రులు, పార్టీ కీలక నేతల ఉన్నతస్థాయి భేటీలో నారా లోకేశ్ స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. , క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి స్థానిక ఎన్నికలు కీలకమన్న నారా లోకేష్.. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా, పారదర్శకమైన పాలనను అందిస్తూ ప్రజల మధ్యే ఉంటున్న కూటమి శ్రేణులు ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. కేవలం విజయం సాధించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు.
[Nara Lokesh, AP local body elections, Panchayat elections, Andhra Pradesh, TDP alliance clean sweep, AP politics,Telugu One]
http://www.teluguone.com/news/content/nara-lokesh-25-232236.html





