ప్రత్యక్ష ఎన్నికలకు దూరం.. శ్రీకాకుళం సీటుపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు
Publish Date:Dec 15, 2025
Advertisement
జనసేన ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరమని సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ కార్యకర్తగానే ఉంటాననీ, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ తన సోదరుడు పవన్ కల్యాణ్ కు అండగా, సహాయంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీగా చాలా హ్యాపీగా ఉన్నానన్న నాగబాబు, తనకు ఇది చాలని అన్నారు. వచ్చే ఎన్నికలే కాదు, అసలు ఏ ఎన్నికలలోనూ తాను పోటీ చేయనన్నారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం (డిసెంబర్ 14) శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన ఐదారేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనన్న ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. వాస్తవానికి తాను ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే.. 2024 ఎన్నికలలోనే పోటీకి దిగేవాడనన్న ఆయన.. తాను స్వయంగా నిర్ణయించుకోవడం వల్లే పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. అయితే వాస్తవానికి నాగబాబు 2024 ఎన్నికలలో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి దిగాలని భావించారు. అందుకు అన్ని విధాలుగా సంసిద్ధమయ్యారు కూడా. అయితే కూటమి పొత్తు ధర్మంలో బాగంగా ఆయన అనివార్యంగా విరమించుకోవలసి వచ్చింది. అనకాపల్లి నుంచి అవకాశం లేదన్నది నిర్ధారణ అయ్యాక కూడా నాగబాబు శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నించారు. అయితే పొత్తు ధర్మం కారణంగా అప్పట్లో ఆ అవకాశం కూడా దక్కలేదు. సరే వచ్చే ఎన్నికల్లో అయినా శ్రీకాకుళం నుంచి బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఆయన తరచుగా శ్రీకాకుళంలో పర్యటనలు చేస్తూ వచ్చారు. ఎంత ఎక్కువగా అంటే గత ఏడాది కాలంలో ఆయన శ్రీకాకుళంలో 12 సార్లు పర్యటించారు. దీంతో నాగబాబు కేంద్ర మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడి సీటుపై కన్నేశారంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఇదో పెద్ద వివాదంగా పరిణమించే అవకాశాలున్నాయని గ్రహించిన నేపథ్యంలో నాగబాబు శ్రీకాకుళం వేదికగా తనకు అసలు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశమే లేదంటూ ప్రకటించి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/nagababu-announce-no-intrest-in-contesting-direct-elections-25-211028.html





