నాదెండ్ల ఘటనే చంద్రబాబును హీరోను చేసిందా?
Publish Date:Apr 23, 2026
Advertisement
1984 నాటి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ఘటన చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో అతిపెద్ద మలుపు అని చెప్పవచ్చు. ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన రాజకీయ చతురత, వ్యూహాలే ఆయనను ఒక శక్తిమంతమైన నాయకుడిగా నిలబెట్టాయి. చంద్రబాబు హీరోగా ఎదగడానికి ఆ ఘటన ఎలా కారణమైందంటే.. నాటి సంక్షోభంలో సమర్థత, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏమిటో చూపించింది. చంద్రబాబును ఇక్కడే ఈ ఘటన ఒక సమర్ధుడిగా నిలబెట్టింది. ఆ నాడు ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని బెంగళూరు, మైసూర్ వంటి ప్రాంతాలకు తరలించడంలో చంద్రబాబు తనను తాను నిరూపించుకున్నారు. అప్పటి గవర్నర్ రామ్ లాల్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రపతి ముందు పరేడ్ చేయించడం వెనుక మాస్టర్ మైండ్ చంద్రబాబే. అంతకుముందు వరకు చంద్రబాబును కాంగ్రెస్ నుంచి వచ్చిన అల్లుడు, ఒక రకంగా కోవర్ట్ గా భావించి, అనుమానించిన పార్టీ కార్యకర్తలు.. ఎన్టీఆర్ అభిమానులు.. ఈ ఘటన తర్వాత ఆయనను ఎన్టీఆర్ కు కుడిభుజంగా చూడటం మొదలుపెట్టారు. ఆపదలో ఉన్న మామకు అండగా నిలబడి, తిరిగి ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంలో చంద్రబాబు సఫలమయ్యారు. ఆ 30 రోజుల ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ యంత్రాంగంతో చంద్రబాబుకు బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదే భవిష్యత్తులో ఆయన పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎదగడానికి పునాది వేసింది. 1984 ఘటన చంద్రబాబులోని రాజకీయ ప్రతిభను లోకానికి చాటిచెప్పింది. ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయి నుండి పార్టీని శాసించే స్థాయికి ఆయన ఎదగడానికి ఆ సంక్షోభమే ప్రధాన కారణమైంది.
http://www.teluguone.com/news/content/nadendla-back-stabing-incident-made-cbn-hero-25-218055.html




