ఆ అఫీడవిట్ లో అన్నీ షాకులే!
Publish Date:Sep 4, 2016
Advertisement
కొన్ని విషయాలు నేరుగా ఓట్లు, ఎన్నికల ఫలితాలతో ముడిపడి వుండటంతో రాజకీయ పార్టీలు పూర్తిగా మౌనం వహిస్తాయి! అలాంటి వివాదాస్పద అంశమే ముస్లిమ్ లలో వున్న ట్రిపుల్ తలాఖ్, బహుభార్యత్వం పద్ధతులు! ఈ రెండిటిపై సుప్రీమ్ లో విచారణ జరుగుతోంది. అదీ ఓ ముస్లిమ్ మహిళ వేసిన కేసు కారణంగానే. అయితే, ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ ను వివరణ ఇవ్వవలసిందిగా కోర్టు కోరటం, వాళ్లు అఫీడవిట్ సమర్పించటం ఈ మధ్య జరిగింది. ఇదే పరిణామం హిందూ సంస్థో, సంఘం విషయంలోనూ జరిగి వుంటే ఈ పాటికి మన రాజకీయ పార్టీలు, సెక్యులర్ నేతలు మైకులు చించుకుని ప్రెస్ మీట్లు పెట్టేవారు. కాని, విషయం మైనార్టీలతో ముడిపడి వుండటంతో అందరూ కిమ్మనకుండా వున్నారు. ఇంతకీ ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ వారు అఫీడవిట్ లో ఏమన్నారు?
సుప్రీమ్ కు సమర్పించిన అఫీడవిట్ లో అనేక అంశాలు వున్నాయి. అందులో షరియా చట్టాన్ని సమర్థిస్తూ మహిళల్ని, మహిళల గౌరవాన్ని కించే పరిచేలా చేసిన వ్యాఖ్యలు కూడా చాలానే వున్నాయి. ప్రధానంగా ముస్లిమ్ పర్సనల్ లా అనేది ఇస్లాం మత గ్రంథాల ఆధారంగా నడిచేదని, దాంట్లో సుప్రీమ్ కలగజేసుకోవద్దని లా బోర్డ్ పెద్దలు అంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవటమే అవుతంది. ఎందుకంటే, ఏ మతానికి చెందిన చట్టాలైనా రాజ్యాంగానికి లోబడే వుండాలి. మత గ్రంథాల ఆధారంగా ఏక్షపక్షంగా కొనసాగుతూ వుండటానికి వీలులేదు.
అఫీడవిట్ లో ముస్లిమ్ మత పెద్దలు చేసిన మరో వ్యాఖ్య... బహుభార్యత్వం లేకపోతే వ్యభిచారం పెరిగిపోతుందని వారు చెప్పుకొచ్చారు! అంతే కాదు, ట్రిపుల్ తలాఖ్ లాంటి ప్రమాదకర ఆచారం కూడా స్త్రీల సంరక్షణకే అంటు వింత వాదం చేశారు. నిజానికి అధికారికంగా ఇస్లామిక్ దేశాలుగా చెలామణి అవుతోన్న అనేక దేశాల్లో కూడా ట్రిపుల్ తలాఖ్ అమలు లేదు. అయినా మన దేశంలో పర్సనల్ లా బోర్డ్ వాళ్లు దాన్ని కొనసాగించాల్సిందే అంటున్నారు. ముస్లిమ్ లలోని మహిళలందర్నీ దెబ్బతీసే ఇలాంటి పద్ధతికి మన రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకంగా గొంతు విప్పకపోవటం ఇక్కడ అసలు విషాదం!
హిందువుల్లో వున్న సతీ, బాల్య వివాహాలు, వరకట్న ఆచారం లాంటి ఎన్నో అమానుష పద్ధతుల్ని , సంప్రదాయాల్ని మనం నిషేదిస్తూ వచ్చాం. అలాగే కోట్ల మంది ముస్లిమ్ స్త్రీల సంక్షేమానికి సంబంధించిన ట్రిపుల్ తలాఖ్, బహుభార్యత్వం విషయాల్లో కూడా సుప్రీమ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. అప్పుడే అందుకోసం పోరాడుతోన్న ఎందరో ముస్లిమ్ స్త్రీల ఆరాటానికి అర్థం వుంటుంది!
http://www.teluguone.com/news/content/muslim-law-board-37-66054.html





