ముంబై రైలు పేలుళ్ల కేసు.. హైకోర్టు తీర్పుని సవాల్ చేయనున్న సర్కారు
Publish Date:Jul 22, 2025

Advertisement
దేశంలోని అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటైన 2006 ముంబై రైలు పేలుళ్లు కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబై లోకల్ రైళ్లలో జూలై 11, 2006న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశాన్ని విషాదంలో ముంచాయి. ఈ కేసులో కింద కోర్టు నిందితులకు విధించిన శిక్షను బాంబే హైకోర్టు రద్దు చేసి నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ముంబై లోకల్ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు ఘటన భారతదేశ చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రవాద దాడుల్లో ఒకటిగా నిలిచింది. ఈ దాడుల్లో 189 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 900 మంది గాయాలపాలయ్యారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల కంటే ఎక్కువ మంది ఈ పేలుళ్లలో మరణించారు . ఈ కేసులో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ 13 మందిని అరెస్టు చేసింది. 2015లో స్థానిక కోర్టు ఒకరిని మినహాయించి మిగిలిన 12 మందిని దోషులుగా తీర్పు చెప్పింది. కానీ, ఇటీవల బాంబే హైకోర్టు ఈ తీర్పును రద్దు చేస్తూ.. ఆ12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం బోంబాయి హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది. బాంబే హైకోర్టులోని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం.. 2015లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ ఈ కేసును నిరూపించడంలో పూర్తిగా విఫలమైందనీ, నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టమని కోర్టు తన 671 పేజీల తీర్పులో పేర్కొంది.
దర్యాప్తులో లోపాలను హైకోర్టు గుర్తించింది. నిందితుల అపరాధాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు సరిపోలేదని, ఒప్పుకోలు వాంగ్మూలాలు నమ్మదగినవి కావని, సాక్షుల కథనాలు అస్పష్టంగా ఉన్నాయని, ముఖ్యమైన కాల్ డేటా రికార్డులను తొందరగా నాశనం చేశారని, ఆధారాలను జాగ్రత్తగా నిర్వహించలేదని కోర్టు పేర్కొంది. ఒప్పుకోలు వాంగ్మూలాలను పరిశీలిస్తే.. మొదటి భాగంలో వివరణాత్మక సమాచారం ఉంది. కానీ, పేలుళ్లకు సంబంధించిన సమాచారం విషయంలో నిందితులు ఇచ్చిన వివరాలు అస్పష్టంగా, అర్థరహితంగా ఉన్నాయి. ప్రాసిక్యూషన్ కూడా ఈ అంశాలపై ఎలాంటి ఆధారాలను సమర్పించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది.
అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించారు. తీర్పు గురించి న్యాయవాదులతో చర్చించినట్లు సీఎం తెలిపారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. ఈ కేసులో న్యాయం కోసం పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
2006 ముంబై రైలు పేలుళ్లు దేశంలోని అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడులు ముంబై రైల్వే వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, సామాన్య ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిలో చాలా మంది దాదాపు 19 సంవత్సరాలు జైలులో గడిపారు. వీరిలో ఒకరైన కమల్ అహ్మద్ అన్సారీ 2021లో మరణించారు. ఈ తీర్పు దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాలు చేయనుంది. దీంతో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/mumbay-train-blast-case-39-202452.html












