ముద్రగడ వర్సెస్ కృష్ణయ్య.. ఎవరి పంతం నెగ్గుతుంది..?
Publish Date:Feb 5, 2016
Advertisement
ఒకవైపు కాపులను బీసీల్లో చేర్చాలని.. తమ జాతికి న్యాయం చేయాలి అంటూ ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారు. ఈరోజు నుండి ఆయన ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరిస్తామని.. దీనిపై కమిటీ ఏర్పాటు చేశాం.. త్వరలోనే నివేదిక ఇస్తామని చెపుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బిసి సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రం ఎట్టి పరిస్థితిలో అది జరగనివ్వం అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాన్ని చంద్రబాబు విరమించుకోవాలని.. చంద్రబాబు జేజమ్మ దిగొచ్చినా కాపులను బీసీ ల్లో చేర్చనివ్వబోమని.. చిన్న చిన్న కులాలను బీసీ జాబితాలో చేరిస్తే స్వాగతిస్తామని, కానీ... అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను చంద్రబాబు కాదు కదా.. ప్రధాని దిగివచ్చినా బీసీ జాబితాలో చేర్చనివ్వబోమని చెపుతున్నారు.
మరి ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ ముద్రగడ పంతం పట్టినట్టు కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే కృష్ణయ్య కూడా దీక్ష చేపట్టడానికి ఏమాత్రం వెనుకాడని పరిస్థితి ఏర్పడింది. మరి కృష్ణయ్య చెప్పినట్టు ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటుందా.. లేకపోతే కృష్ణయ్య చెప్పినట్టు కాపుల్లోనే చిన్న చిన్న కులాలను మాత్రం బీసీలో కలుపుతారా.. అలా చేస్తే దానికి ముద్రగడ ఒప్పుకుంటారా ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి ఎవరి పంతం నెగ్గుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
http://www.teluguone.com/news/content/mudraga-vs-r-krishnaiah-39-55216.html





