కేంద్రమంత్రులతో కోమటిరెడ్డి భేటీల వెనుక అసలు కారణం అదేనా?
Publish Date:Sep 30, 2021
Advertisement
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కు దూరమవడం ఖాయమైనట్టేనా? రేవంత్ పీసీసీ చీఫ్ గా ఎన్నికవడాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. పీసీసీ పదవి తమకే కావాలని పట్టుబడుతూ వచ్చారు. అయితే హైకమాండ్ మాత్రం ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా ఓ స్థిరమైన నిర్ణయం తీసుకొని రేవంత్ కే పట్టాభిషేకం చేసింది. దీంతో ఇక కాంగ్రెస్ లో తాము ఇమడలేమన్న నిర్ధారణకు కోమటిరెడ్డి వచ్చినట్లేనా అన్న అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో, బీబీనగర్ లోని ఎయిమ్స్ అభివృద్ధి పేరుతో కేంద్రానికి దగ్గరవుతూ... అదే సమయంలో కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకులను ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ దూకుడుతో టీఆర్ఎస్ కు మరో ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తోందన్న అంచనాలు పెరుగుతున్న క్రమంలో కోమటిరెడ్డి స్ట్రాటజీ రేవంత్ అండ్ టీమ్ ను బలహీనపరచేలా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ కావడం నల్గొండ జిల్లా రాజకీయాల్లోనే గాక కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. భువనగరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోమటిరెడ్డి కోరారు. తన అభ్యర్థన మేరకు, అడిగిందే తడవు రూ. 800 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినందుకు కేంద్రమంత్రికి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరువాత అంతటి ప్రాధాన్యత బీబీనగర్ ఎయిమ్స్ కు ఉంది. హైదరాబాాద్ కు అతి దగ్గరలో ఉన్న బీబీనగర్ ఎయిమ్స్ రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్లే అభివృద్ధికి నోచుకోవడం లేదని, అందుకే దాని అభివృద్ధి కోసం తాను కేంద్రమంత్రిని కలిశానని కోమటిరెడ్డి అంటున్నారు. ఈ సంస్థను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాననీ హామీ ఇస్తున్నారు. దాదాపు 20 నిమిషాల వీరి భేటీ తరువాత కోమటిరెడ్డి ఎంతో ఆనందంగా తిరిగిరావడం, తన కృషి ఫలించిందని సంతృప్తి వ్యక్తం చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అభివృద్దికి నోచుకోకుండా ఉన్న ఎయిమ్స్ పై చాలా సార్లు కేంద్ర మంత్రులను, ఇతర ఉన్నతాధికారులను కోమటిరెడ్డి కలిసి విన్నవించారు. ఈ క్రమంలోనే ఇటీవల నూతనంగా ఆరోగ్య శాఖ బాధ్యతలు స్వీకరించిన మన్సుఖ్ మండవీయను కలిసి బీబీనగర్ ఎయిమ్స్ పరిస్థితిని వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం రూ. 776.13 కోట్లు భవనాల నిర్మాణానికి కేటాయించింది. అలాగే మరో రూ. 23.50 కోట్లు ఎయిమ్స్ నిర్వహణ కొరకు మంజూరు చేశారు. దీంతో ఎయిమ్స్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. ఆరోగ్యపరంగా, అది కూడా కోవిడ్ విజృంభించిన తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని దశల్లోనూ విఫలమైన తరుణంలో ఎయిమ్స్ కు సర్వహంగులూ సిద్ధించే శుభఘడియలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చాశంగా మారింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ లో ముఖ్యమంత్రిని మార్చడం, పంజాబ్ పాలనలో తనదైన ముద్ర వేసుకొని అన్ని పక్షాల నుంచి ప్రశంసలు అందుకున్న అమరీందర్ సింగ్ ను తప్పించడం, పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అనూహ్యంగా నవ్ జోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరువు పోతోంది. అదే సమయంలో ఛత్తీస్ గఢ్ సీఎంకు వ్యతిరేకంగా మరో వర్గం ఢిల్లీలో ల్యాబీయింగ్ చేస్తుండడంతో రాహుల్ గాంధీ అపరిపక్వత మరోసారి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా బీజేపీ వైపు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా బీజేపీ పెద్దలతో సఖ్యంగా కనిపించడం సహజంగానే తాజా రాజకీయాలపై పుకార్లకు తావిస్తోంది. హుజూరాబాద్ కు త్వరలో ఉపఎన్నిక జరుగుతున్న పరిస్థితుల్లో కోమటిరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగడంపై పునరాలోచన చేస్తున్నారా.. లేక నిజంగా బీబీనగర్ ఎయిమ్స్ కు నిధులు రాబట్టేందుకే ఆయన పర్యటనను పరిమితం చేశారా... అదే నిజమైతే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంటివారితో కాకుండా ఒక్క కోమటిరెడ్డిని మాత్రమే ఎక్స్ పోజ్ చేస్తూ నిధులు విడుదల చేయడంలో మర్మమేంటి అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఇలాంటి అనుమానాల నేపథ్యంలో కోమటిరెడ్డి తాజా అడుగులు ఎలా పడతాయి.. ఎటువైపు మొగ్గు చూపుతాయో రాజకీయ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/mp-komatireddy-venkat-reddy-will-join-bjp-soon-25-123795.html





