షర్మిల పాదయాత్రకు జనం కరువు
Publish Date:Mar 30, 2013
Advertisement
పాదయాత్రలు చేయడం ఒక ఎత్తయితే, దానికి ప్రజలను ఆకర్షించడం మరొక పెద్ద సవాలు. సుదీర్ఘ రాజకీయనుభవం, వివిధ అంశాల పట్ల పూర్తి అవగాహనతో పూర్తి సాధికారికంగా మాట్లాడగలిగిన చంద్రబాబు తన పాదయత్రలో జనాలను బాగానే ఆకట్టుకొంటున్నప్పటికీ, కాంగ్రెస్, తెదేపాలను దుమ్మెత్తి పోయడమే ప్రధాన లక్ష్యంగా, ‘జగనన్న జైలు నుండి బయటకి వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు’ అంటూ చిలక పలుకులు పలికే షర్మిల పాదయత్రలకి మాత్రం ఆ పార్టీ నేతలు జనసమీకరణ కోసం కష్టపడక తప్పట్లేదు అని సమాచారం. స్థానిక నేతల మద్య అవగాహన లోపించినపుడో లేక వారు అశ్రద్ధ చూపినపుడో తప్ప ఇంతవరకు దాదాపు అన్నిచోట్ల ఆమె పాదయాత్రలకు జనం బాగానే ఉన్నారు. అయితే, నిన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని షర్మిల చేసిన పాదయాత్రలో స్థానిక నాయకుల వైఫల్యం వలన బొత్తిగా జనం కనబడలేదు. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరయిన విజయవాడలో జనం కరువడం చాల విచిత్రం. మిగిలిన అన్ని జిల్లాలతో పోలిస్తే ఇక్కడ జనసమీకరణ చేయకుండానే చాలా భారీ ఎత్తున జనాలు స్వచ్చందంగా తరలివస్తారని అంచనాలు వేయడం వలననేమో స్థానిక నాయకులు కొంచెం అలసత్వం చూపడంతో నిన్న షర్మిల పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. శుక్రవారంనాడు ఆమె కృష్ణవేణి పాఠశాల వద్ద పాదయాత్ర మొదలుపెట్టే సమయానికి వైకాపా కార్యకర్తలు, నాయకులూ కూడా చేరుకోవడం ఆలస్యమయ్యే సరికి ఆమె చాలా అసహనం వ్యక్తం చేసారు. కొద్ది సేపటి తరువాత వచ్చిన కొద్ది మంది కార్యకర్తలనే తోడూ చేసుకొని పటమట నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు కేవలం ఐదు నిముషాలలో చేరుకోగలిగారంటే ఆమె పాదయత్రకి జనస్పందన ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చును. ఆమె పాదయాత్రలో కనీసం మహిళా నాయకులు కూడా ఎవరూ కనిపించకపోవడం మరో విశేషం. మొత్తం మీద పటమటలంకలో కొద్దిమంది కార్యకర్తలతో సాగిన అరగంటలోపే ముగపోయింది. జనం కనిపించక పోవడంతో దారిలోనే ఉన్నసెయింట్ పాల్ కెథడ్రల్ చర్చిలో గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి పటమట, ఆటోనగర్ గేటు మీదుగా పెనమలూరు మండలంలోకి ప్రవేశించారు. అయినా దారిపొడుగునా అదే పరిస్థితి ఎదురవడంతో షర్మిల అసహనం వ్యక్తం చేస్తుండటంతో ఆమె వెంట నడుస్తున్న వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్యెల్యే వంగవీటి రాధాకృష్ణ తదితరులు కొంచెం ఆందోళనకు గురయినట్లు కనిపించారు. జనాలు రాకపోయినా కనీసం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు కూడా షర్మిల పాదయాత్రకు నిన్న ఎందుకు మొహం చాటేశారో అర్ధం కాక వారు చాల ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ రోజు పాదయాత్రలో మళ్ళీ అటువంటి పరిస్థితి తలెత్తకూడదని ముందు జాగ్రత్త చర్యగా తమ అనుచరులకు చెప్పి తగిన జనసమీకరణ కొరకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/-39-22058.html





