మహానాడు మెనూ చూస్తే నోరూరాల్సిందే!
Publish Date:May 27, 2025
Advertisement
తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు మంగళవారం (మే 27) ప్రారంభమైంది. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత కడపలో తొలిసారిగా మహానాడు జరుగుతోంది. ఎన్ని విధాలుగా ఇది తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన విషయం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సారి మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రత్యేకతలతో పాటు మహానాడు సందర్భంంగా ఈ సారి భోజనాల ఏర్పట్లు కూడా అత్యంత ఘనంగా ప్రత్యేకంగా చేస్తున్నారు. మహానాడుకు హాజరయ్యే ప్రతినిథులకు నోరూరించే విందు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు జరిగే మూడు రోజులూ ప్రత్యేక వంటకాలతో రుచికరమైన విందు ఏర్పాట్లకు సర్వం సిద్ధమైంది. చాలా కాలం తరువాత ఈసారి మహానాడులో మాంసాహార వంటకాలను కూడా వండి వడ్డిస్తారు. మహానాడు జరిగే మూడు రోజులూ కూడా రోజుకు 30 రకాల ప్రత్యేక వంటకాలతో మెనూ సిద్ధమైంది. వీటిలో మచ్చుకు కొన్ని చెప్పుకోవాలంటే.. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డూ, అలాగే పప్పు, దప్పళం, ఉలవచారు, పాలతాలికలు, చక్కెర పొంగలి, ఇంకా ఆపిల్ హల్వా, వెజ్ జైపూరి, కడాయి వెజిటబుల్ కుర్మా ఇలా.. ప్రతిరోజూ దాదాపు 30 రకాల వంటకాలతో అతిథులకు పసందైన భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలీ మెనూ చూస్తేనే ఎవరికైనా నోరూరడం ఖాయం అన్నట్లుగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ వేలాదిగా తరలి వచ్చే ప్రతినిథులకు పసందైన విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం రాష్ట్రంలోని దాదాపు వంద మంది ప్రావీణ్యత ఉన్న వంట వాళ్లు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. మహానాడు మెనూ చూస్తేనే మాయా బజార్ లోని వివాహ భోజనంబు పాట గుర్తుకురాక మానదు. అయితే తెలుగుతమ్ముళ్లు మాత్రం వహానాడు భోజనంబు అని మార్చి పాడుకుంటున్నారు. ఇక భోజనాల కోసం ప్రత్యేకంగా ఐదు భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండింటిని పూర్తిగా నాయకులు, కార్యకర్తల కోసం కేటాయించగా, ఒకటి మంత్రులు, ఎమ్మెల్యేల కోసం, మరోటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల కోసం, ఇంకోటి మహానాడుకు హాజరయ్యే ప్రముఖులు, జీవితకాల సభ్యత్వం తీసుకున్న వారికి కేటాయించారు. ఒక్కో షెడ్డులో ఒకే సారి 3500 మంది భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ కనీసం 30 వేల మందికి సరిపడా వంటకాలను తయారు చేయిస్తున్నారు. ఇక మహానాడు చివరి రోజున దాదాపు 3లక్షల మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/mouth-watering-menu-for-mahanadu-25-198758.html





