నీడలే కాటేస్తాయ్!
Publish Date:May 27, 2022
Advertisement
ఆడపిల్లకు మగవాడు రక్షణ. ఈ సమాజంలో ఇలాగే ఉంది. ఒక కూతురికి తండ్రి రక్షణ, తరువాత తమ్ముళ్లు, లేక అన్నలు. తరువాత భార్యకు భర్త రక్షణ, తల్లిదండ్రులు లేక, భర్త లేక నిస్సహాయంగా ఉన్నవారికి భర్త తమ్ముడో, భర్త తండ్రి(మామయ్య), ఇంకా ఇతర బంధాలు కలిగినవాళ్ళు బాసటగా నిలుస్తూ మేమున్నాం అనే ధైర్యం చెబుతూ ఉంటారు. అలాంటి ధైర్యంతో జీవితాన్ని ముందుకు సాగించే వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఇలా మేమున్నామని ధైర్యం ఇవ్వాల్సిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే. ఒక ఆడపిల్లకు ఈ కాలంలో లోపించిన రక్షణ ఏదంటే నిస్సందేహంగా మాన రక్షణ లేదని చెప్పుకోవచ్చు. ప్రతి అడ్డమైన వెధవకూ అమ్మాయిల్ని చూస్తే అదొక కోరిక పుట్టేస్తుంది. వాడు బలవంతుడు అయితే బలవంతంగానే అమ్మాయిల్ని పాడుచేస్తాడు. ఇలాంటివి బయట ఎక్కడో జరిగితే అందరూ అనే మాట ఒకటి ఉంది. ◆"ఉద్యోగమని ఏదో పొడిచేద్దామని తెగ తిప్పుకుంటూ పోయిందిగా ఏమయ్యింది ఎవడో మాయమాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లి చేయాల్సింది చేసాడు" ◆"వీళ్ళేదో వీరనారులు అనుకుని ఫీలవుతూ సాయంత్రం అయినా ఇంటికి పోవడంలేదు. ఇక ఏమవుతుంది ఎక్కడో తాగిన వెధవలు చూసి వెంటబడి వాడి పని వాడు చేసుకుపోయాడు" ◆"అయినా ఒంటరిగా పోవడం ఎందుకు?? అంత పర్సనల్ పనులు ఏముంటాయి. ఏదో గూడు పుటానీ ఉంటుందిలే" ◆"బట్టలు సరిగ్గా వేసుకుంటే కదా!! ఫాషన్ పేరుతో వగలు పడతారు. మగవాళ్లను రెచ్చగొడతారు" ఇలా ఒక్కొక్కరు ఒకో మాట మాట్లాడతారు ఎక్కడైనా ఏదైనా రేప్ జరిగిందని తెలిస్తే. సరే వీటన్నిటికీ కారణాలు ఉంటాయి. కానీ వేరే సంగతి ఏంటి?? తాగిన మత్తులో కూతుర్ని తండ్రి బలవంతం చేయడం. భర్త చనిపోయి ఇంట్లో ఉంటున్న కోడల్ని మామ బలవంతం చేయడం. అన్న భార్య మీద మనసు పడి మరిది వదినను బలవంతం చేయడం. సమాజంలో వావి వరుస అనేవి ఎప్పుడో అంతరించి పోయాయి అనే డైలాగ్ కు నిదర్శనంగా ఎక్కడ చూసినా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. వీటన్నిటికి ఎవరు ఏమని సంజాయిషీ ఇస్తారు?? జాగ్రత్తలు కావాలిప్పుడు!! ఇలా జరుగుతున్నప్పుడు ఎవరు ఎవరినీ ఏమనీ నిందించలేం. చాలామంది జరుగుతున్న వాటికి కారణాలు చెప్పి, విమర్శలు చేసి, శిఖలూ వేస్తారు కానీ పరిష్కారాలు ఏంటి అనేది మాత్రం తక్కువే. ఇక్కడ పరిష్కారం అంటే అమ్మాయిలకు నష్టం జరిగిపోయాక వేసే శిక్షలు, ఇచ్చే నష్టపరిహారాలు అనుకుంటున్నారు అందరూ. కానీ అది చాలా తప్పు, అది కాదు కావాల్సింది అసలు ఇలంటివి జరగకుండా చూడాలి. అమ్మాయిలు తమను తాము రక్షించుకోగలిగే సామర్థ్యము కలిగి ఉండాలి. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి. ఈ కాలానికి తగ్గట్టు ఒకరి మీద ఆధారపడటం మానేయాలి, అలాగే మగవాళ్లను చనువుగా మాట్లాడించడం మానుకోవాలి. లేకపోతే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే మహామహులు ఉంటారు. తోడుగా!! అమ్మాయిలకు జరుగుతున్న ఈ ఘోరాలను ఆపాలి అంటే ఒకరి నుండి మరొకరికి సపోర్ట్ చాలా అవసరం. అమ్మాయిలు ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు ఒంటరిగా కాకుండా కలసికట్టుగా చెయ్యాలి. స్నేహితులు, చుట్టాలు, చనువుగా ఉన్నవారు ఇలా మగవాళ్లను ఎవరిని కూడా అతిగా నమ్మేయకూడదు. ఎవరితో కూడా వెళ్లకూడదు. పైనవి ఎన్ని చెప్పుకున్నా ఈ సమాజంలో పక్కనుండి ఇలా పాముకాటు వేసేవాళ్ళు ఎక్కువైపోతూనే ఉన్నారు. అందుకే అమ్మాయిలూ…… జాగ్రత్త!! ◆వెంకటేష్ పువ్వాడ.
http://www.teluguone.com/news/content/most-inspirational-short-stories-35-136522.html





