రిజర్వేషన్లు ఉండాల్సిందే.!
Publish Date:Aug 7, 2026
Advertisement
దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థపై ఉండాల్సిందే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువతతో ముఖాముఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా యువత సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో అసమానతలు, వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు అమల్లో ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. రిజర్వేషన్ల ఫలాలను అందుకుని ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరిన వారు తమ వర్గాల్లోని ఇతర వెనుకబడిన వారి ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా కోటాను వదులుకోవాలన్నారు. రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు. చారిత్రక కారణాల వల్ల సమాజంలో ఏర్పడిన హెచ్చుతగ్గులు, వివక్షలను తొలగించడానికే రిజర్వేషన్ల వ్యవస్థ రూపుదిద్దుకుందని వివరించిన ఆయన, ఆ అసమానతలు, వివక్షలూ పూర్తిగా తొలగిపోయే వరకూ రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనన్నారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం రిజర్వేషన్లను వాడుకోవడం వల్ల సమాజంలో సఖ్యత దెబ్బతిని, వర్గాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్న ఆయన ప్రాథమికంగా సమాజంలో ఐక్యత, సమానత్వం సాధించడానికి రూపుదిద్దుకున్న ఒక గొప్ప వ్యవస్థను, స్వార్థ రాజకీయాల కోసం తప్పుదోవ పట్టించడం శ్రేయస్కరం కాదన్నారు. దేశంలో రిజర్వేషన్ల పరిమితులు, వర్గీకరణ, కొత్త కులాల చేరికలపై విస్తృత స్థాయిలో చర్చలు, ఆందోళనలు జరుగుతున్న వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Mohan Bhagwat, RSS Chief Mohan Bhagwat, Reservations In India, Voluntary Giving Up Reservation, Social Equality India
http://www.teluguone.com/news/content/mohan-bhagwat-25-228236.html





