సచివాలయంలో టీ-ఫైబర్‌పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక సమీక్ష
Publish Date:Aug 4, 2026
Advertisement
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ ఆపరేటర్ల ఇంటర్నెట్ సేవలను వినియోగించకుండా, పూర్తిగా టీ-ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్ అందేలా చర్యలు చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీ-ఫైబర్ సేవలపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక సమీక్ష నిర్వహించారు. సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ టీ-ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల కోసం ప్రైవేట్ ఆపరేటర్లకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని అధికారులను శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాలకు అంతరాయం లేకుండా టీ-ఫైబర్ కనెక్టివిటీ అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు సేవలందిస్తున్న ‘టీ-స్వాన్’ (T-SWAN) నెట్‌వర్క్‌ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల డిజిటల్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ మార్పిడి ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందేలా అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అనుగుణంగా అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికి ఇంటర్నెట్’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ నాణ్యమైన, అందుబాటులో ఉండే ఇంటర్నెట్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. Minister Sridhar Babu key review on T-Fiber, T-SWAN, Minister Sridhar , T-Fiber Connectivity, CS Sanjay
http://www.teluguone.com/news/content/minister-sridhar-babu-key-review-on-tfiber-25-227984.html




