రాజావారి బడిలో నారాయణ వర్సెస్ రామ నారాయణ
Publish Date:Jul 8, 2025
Advertisement
ఆయనొక మంత్రి. ఈయనా మంత్రే. ఒకరు దేవాదాయం, మరొకరు మున్సిపల్. VRC నెల్లూరు జిల్లాకే అతి పెద్ద చరిత్ర గలిగిన విద్యా సంస్థలుగా పేరుంది. పెద్ద పెద్ద వాళ్లు ఇక్కడ చదువుకున్న వారే అన్న హిస్టరీ సైతం కలిగి ఉందీ ప్రాంగణం. అలాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు గత యాభై ఏళ్ల నుంచి ఆనం కుటుంబం అధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే గత జగన్ సర్కార్.. ఈ విద్యా సంస్థలను ఆనం వారి నుంచి లాగేసుకుంటే.. ఇప్పుడా ప్రక్రియను మంత్రి నారాయణ పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారా? అన్న అనుమానం వెలుగు చూస్తోంది. తాజాగా VRCకి సంబంధించి ఒక ప్రొగ్రాం జరిగింది. ఇది మంత్రి నారాయణ అధ్వర్యంలో జరిగింది. బేసిగ్గానే మంత్రి నారాయణ అంటే నారాయణ కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సంస్థల అధినేత. ఆయన కూడా VRCలో చదవడం మాత్రమే కాదు.. ఇక్కడ అతి తక్కువ జీతానికి లెక్చరర్ గా పని చేసినట్టుగానూ చెబుతారు. ఆయనే చాలా సార్లు తనకూ వీఆర్సీకీ ఉన్న గతాన్ని గుర్తు చేసేవారు. తనకూ VRCకి ఉన్న అనుబందం దృష్ట్యా తాను గెలిస్తే.. 15 కోట్లు వెచ్చించి ఈ విద్యా సంస్థలను ఆధునీకరిస్తానని హామీ ఇచ్చిన నారాయణ అన్నంత పనీ చేశారు. అంతే కాదు విద్యా మంత్రి నారా లోకేష్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ సభకు పిలవకుండానే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వచ్చారు. ఈ విద్యా సంస్థల చరిత్ర గురించి వివరించారు. 150 సంవత్సరాల క్రితం బ్రిటీష్ హయాంలో క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లు మాత్రమే ఉండేవనీ.. 1975లో సుంకాల నారాయణ స్వామి శెట్టి- హిందూ వర్నాక్యులర్ ఆంగ్లో హై స్కూల్ స్థాపించారనీ.. అప్పట్లో వెంకటగిరి రాజా వారు రూ. 50 వేల విరాళం ఇస్తామన్నారనీ. దీంతో ఈ విద్యా సంస్థలకు వెంకటగిరి రాజాస్ కళాశాల అని పేరు పెట్టారనీ.. అయితే రాజావారు ఇస్తానన్న విరాళం ఇవ్వలేదనీ.. గత యాభై ఏళ్లుగా ఆనం పెద్దలు... ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి చైర్మన్ గా ఉండేవారనీ.. వైసీపీ హయాంలో ఆనం వారి అధికారం పోయిందనీ.. దీంతో ఇక్కడి విద్య మసకబారిందని చెప్పుకొచ్చారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. సొంత ప్రభుత్వం వచ్చాక అయినా.. ఈ విద్యా సంస్థల్లో ఆనం వారి పట్టు నిలుస్తుందని భావిస్తే.. ఇప్పటి వరకూ తాము విస్తరిస్తూ వచ్చిన VRC లెగసీని.. ఒక్క దెబ్బతో మంత్రి పొంగూరు నారాయణ తన్నుకు పోవడంతో.. అది పిలవని పేరంటమే అయినా సభలోకి దూసుకొచ్చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. తన ఆక్రోశం మొత్తం వెళ్లగక్కారు. తమ కుటుంబం ఈ కళాశాలను ఎలా కాపాడుకుంటూ వస్తుందో చెప్పి.. ప్రస్తుతం మంత్రి పొంగూరు నారాయణ వంటి వారు ఎలా ఆక్రమిస్తున్నారో వివరించారాయన.తాము మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వారమనీ. అందుకే వెంకటగిరి రాజా వారి విద్యా సంస్థలను మధ్య తరగతి విద్యార్ధుల విద్యాభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దుతూ వచ్చామనీ.. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత అయిన నారాయణ వచ్చి.. ఇక్కడి విద్యను కార్పొరేటీకరణ చేయడం సరికాదన్న ధోరణిలో ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్లు నెల్లూరు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. వీటిలో మొదటిది స్థానికంగా ఒక మంత్రి ఉండగా.. ఆయనకంటూ ఒక ప్రొటోకాల్ ఉంటుంది. అది ఎందుకు పాటించలేదు? ఇది ప్రభుత్వ పరమైన చర్చ కాగా.. ఇద్దరు మంత్రులు.. నారాయణ వర్సెస్ ఆనం రామనారాయణ మధ్య విబేధాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయా? అసలేం జరుగుతోందీ నెల్లూరులో అన్న మరో రాజకీయ రగడ ప్రారంభమైంది.మరి అధిష్టానం ఈ ఇరువురు మంత్రుల మధ్య గల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. అయితే కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత అయిన నారాయణ పిలవగానే విద్యా మంత్రి లోకేష్ రావడం చూస్తుంటే ఈ రాజకీయపు త్రాసు అటు వైపే ఎక్కువగా మొగ్గుతున్నట్టు కనిపిస్తోంది. గత వైసీపీ పాలనలో ఇలాంటివి సహించలేక.. టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రిత్వం ఇచ్చారు లే అనుకుంటే అది కూడా దేవాదాయ శాఖ కావడం. వచ్చినప్పటి నుంచీ టీటీడీ నుంచి అప్పన్న ఆలయం వరకూ ఏవో ఒక వివాదాలు. ఆపై ఈ శాఖకున్న సెంటిమెంటూ వెరసీ.. ఆనం ఒకింత అసహయానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు గత అర శతాబ్దంగా తమ ఆధీనంలో ఉన్న VRC ఆనే బ్రాండెడ్ విద్యా సంస్థలను ఇన్నేళ్ల పాటు కాపాడుకుంటూ వస్తే.. అది కూడా కార్పొరేట్ కింగ్ మంత్రి నారాయణ కబ్జా చేస్తుంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారట మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మరి చూడాలి.. ఈ ఇద్దరు అమాత్యుల మధ్య చెలరేగుతోన్న వివాదాలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో తేలాల్సి ఉందంటున్నారు నెల్లూరు వాసులు.
http://www.teluguone.com/news/content/minister-narayana-25-201529.html





