మేఘా కృష్ణారెడ్డి సర్వే.. ఏపీలో రాబోయేది తెలుగుదేశం కూటమి సర్కారే?!
Publish Date:May 15, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు అధికారికంగా జూన్ 4న వెలువడతాయి. ఆ లోగా ఏ పార్టీని విజయం వరిస్తుందన్న అంచనాలతో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంతే అంత కంటే ముందు రాష్ట్రంలో విజయం తెలుగుదేశం కూటమిదా? వైసీపీదా అన్న విషయాన్ని సాధికారికంగా ఎవరూ చెప్పే అవకాశం లేదు. షెడ్యూల్ విడుదలకు ముందు వెలువడిన డజనుకు పైగా సర్వేలు తెలుగుదేశం కూటమిదే విజయం అని తేల్చిసినట్లు ఫలితాలు వెలువరించినా.. వాటిని వేటినీ కచ్చితమైన ఫలితంగా పరిగణించలేము. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉన్నా పలు ప్రసిద్ధ సర్వే సంస్థలను ఉటంకిస్తూ సామాజిక మాధ్యమంలో ఫలానా పార్టీదే విజయం, ఫలానా పార్టీకి ఘోర పరాజయం తథ్యం అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయా పోస్టుల్లో ఉటంకించిన సంస్థలేవీ వాటిని నిర్ధారించడం లేదు. తమ సంస్థే ఈ సర్వే నిర్వహించిందని అంగీకరించడం కానీ, ఖండించడం కానీ చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున కాంట్రాక్టులు వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ టైకూన్ అని చెప్పదగ్గ మేఘా కృష్ణారెడ్డి చేయించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలుగా చెబుతూ సామాజిక మాధ్యమంలో ఏపీ ఔట్ కమ్ పై పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా మేఘా కృష్ణారెడ్డి చేయించిన సర్వే ఫలితం అంటూ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న నివేదిక ప్రకారం ఏపీలో అధికారం చేపట్టబోయేది కూటమి ప్రభుత్వమే. అయితే దీనికి ఎలాంటి సాధికారతా లేదన్నది పక్కన పెడితే.. మేఘా కృష్ణారెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు కీలక కాంట్రాక్టులను దక్కించుకున్న వ్యక్తి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తం. అదే విధంగా ఏపీలో కూడా జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ పుణ్యమా అని పోలవరం వంటి భారీ కాంట్రాక్టును కూడా దక్కించుకున్నారు. అటువంటి మేఘా కృష్ణారెడ్డి చేయించినట్లుగా చెబుతున్న సర్వే ఫలితం తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. తన పేరుపై సర్క్యులేట్ అవుతున్న సర్వే రిపోర్టుపై మేఘా ఇప్పటి వరకూ ఖండించనూ లేదు, సమర్ధించనూ లేదు.
http://www.teluguone.com/news/content/megaha-krishnareddy-survey-say-tdp-alliance-power-25-176078.html