మూగజీవాల రక్తం అక్రమ సేకరణ చేస్తున్న ముఠా గుట్టు రట్టు
Publish Date:Jan 4, 2026
Advertisement
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ సంచలనంగా మారింది. రహస్యంగా మేకలు, గొర్రెల వంటి మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరించి, బయటకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మటన్ షాప్‌ను కేంద్రంగా చేసుకుని మూగజీవాల నుంచి అడ్డగోలుగా రక్తం సేకరిస్తూ, దాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించి... మటన్ షాప్ యాజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రక్తాన్ని ప్లేట్‌లెట్స్ తయారీతో పాటు కొన్ని వ్యాధులను నయం చేస్తామని నమ్మబలికి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే సరైన వైద్య ప్రమాణాలు, అనుమ తులు లేకుండా ఇలా రక్తం సేకరించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసుకోవడం వల్ల అవి ఒక రోజు తర్వాత మృత్యువాత పడుతున్నాయని జంతు హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మూగజీవాలపై అమానుష చర్యగా పేర్కొంటూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిదైనా ప్రమేయం ఉందా? ఈ రక్తం ఎక్కడికి తరలించేవారు? ఎవరికెవరికీ సరఫరా చేసేవారు? అన్న కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ రక్త వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.ఈ ఘటనతో నాగారం సత్యనారాయణ కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. మూగజీవాల రక్షణకు కఠిన చర్యలు అవసరమన్న డిమాండ్ మరింత బలపడుతోంది.
http://www.teluguone.com/news/content/medchal-malkajgiri-district-36-211982.html





