పొత్తులకు మాయావతి గుడ్ బై.. యూపీలో అధికారం కోసం ఒంటరి పోరు
Publish Date:Jan 16, 2026
Advertisement
బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, ఎన్నికల పొత్తులకు గుడ్ బై చెప్పేశారు. యూపీలో బీఎస్పీకి పునర్వైభవం, పునరాధికారమే లక్ష్యంగా వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఒంటరి పోరుకే సై అనేశారు. ఈ మేరకు గురువారం (జనవరి 14) తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ, 2027లో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి చెప్పారు. అంతే కాదు.. ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంటానన్న ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో ఏ కూటమితోనూ, ఏ పార్టీతోనూ జతకట్టకుండా ఒంటరిగా పోటీలోకి దిగడానికే తమ పార్టీ మొగ్గు చూపుతోందన్నారు. బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు. ఇక ఆమె ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేశారు. వాటి విశ్వసనీయత ప్రశ్నార్థకమన్న మాయావతి.. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాయావతికి జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. మాయావతి ఒంటరి పోరు ప్రకటనతో యూపీలో రాజకీయాలు రసకందాయంలో పడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.
గత ప్రభుత్వాలు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ను నిర్లక్ష్యం చేశాయని, కనీసం ఆయన మరణించిన రోజును సంతాపం దినంగా ప్రకటించలేదనీ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు ముస్లింలు, ఇతర వర్గాలను చిన్నచూపు చూశారని, అదే బీఎస్పీ పాలనలో సమానత్వం వెల్లివిరిసిందనీ, రాష్ట్రంలో మతపరమైన కలహాలు జ రగలేదనీ గుర్తు చేశారు.
http://www.teluguone.com/news/content/mayawati-say-no-to-laaiance-25-212603.html




