సజ్జల, జగన్ మధ్య మావిగన్ చిచ్చు.!
Publish Date:Jul 9, 2026
Advertisement
వైపీపీలో అంతర్గత పరిణామాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిపోయింది. దీనికి తోడు జగన్ తీరుతో పార్టీలోని సీనియర్ నాయకులు పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకే కాదు.. చివరాఖరికి అధినేత జగన్ కు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. అధినేత జగన్ ఆదేశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సజ్జల పూర్తిగా విఫలమవుతున్నారని,జగన్ ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఈ వివాదానికి కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అంటున్నారు. మావిగన్ ప్రతిపాదనను పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సజ్జల రామకృష్ణారెడ్డి విఫలమయ్యారని జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాదు.. సొంత మీడియాలో కూడామావిగన్ అంశానికి ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కకపోవడం జగన్ కు మింగుడుపడలేదు. మావిగన్ ను సొంత మీడియా కూడా పట్టించుకోకపోవడం వెనుక ఉన్నారని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మూడు రాజధానుల స్టాండ్ కారణంగా ప్రజాదరణ, ప్రజా విశ్వాసాన్నీ కోల్పోయామనీ, ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ ప్రజజల్లోకి వెడితే ప్రతికూలత మరింత ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో.. సజ్జల, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావించారనీ, అవే సంకేతాలను క్షేత్రస్థాయికి కూడా పంపారనీ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక్కడే.. జగన్ కు తన ఆదేశాలను కాదని సజ్జల స్వతంత్రంగా వ్యవహరించడం రుచించలేదు. తీవ్ర ఆగ్రహానికి లోనై సజ్జలను ఒకింత తీవ్రంగానే మందలించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, పార్టీ సమన్వయకర్తగా, సకల శాఖల మంత్రిగా ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ సర్వస్వం తానే అన్నట్లుగా సజ్జల వ్యవహరించారు. ఆయన కుమారుడికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే ఈ ఆధిపత్యం పార్టీలోని సీనియర్ నేతలకు అస్సలు నచ్చలేదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా.. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడానికి సజ్జల అనుసరించిన ఏకపక్ష విధానాలే కారణమని సీనియర్లు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. విజయసాయిరెడ్డి వంటి కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డే కారణమంటూ జగన్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ జగన్ సజ్జలపై నమ్మకం ఉంచారు. కానీ మావిగన్.. విషయంలో సజ్జల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. దీంతో సజ్జల కూడా పార్టీ వ్యవహారాలలో ఇక నుంచి అంటీ ముట్టనట్లు వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి మధ్య ఈ విభేదాలు పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయా అన్న ఆందోళన వైసీపీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది. YSRCP Latest News, Mavigan Capital AP, YSRCP Internal Cold War
http://www.teluguone.com/news/content/mavugun-rift-between-sajjala-and-jagan-25-225546.html





