అర్ధరాత్రి స్ట్రాం రూమ్ వద్దకు మమతా బెనర్జీ.. పశ్చిమబెంగాల్ లో ఏం జరుగుతోంది?
Publish Date:Apr 30, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న తరుణంలో కోల్‌కతాలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం (ఏప్రిల్ 30) రాత్రి కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గ ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న ఆమె.. అక్కడ సుమారు మూడు గంటల పాటు ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. ఇది తమకు చావో రేవో తేల్చుకునే పోరాటంటూ ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. కేంద్ర దళాలు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి లేదా ఏజెంట్ స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లే అధికారం ఉంటుందన్నారు. తమ పార్టీ ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫలితాలు వెలువడే మే 4వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా ఈ ఆరోపణలను పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం.. మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయంది. . సిసిటివి ఫుటేజీలో కనిపిస్తున్నది కేవలం పోస్టల్ బ్యాలెట్ల విభజన ప్రక్రియే తప్ప.. ఈవీఎంలను తాకడం లేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి బెంగాల్‌లో రాజకీయ వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో.. ప్రతి ఓటును కాపాడుకోవాలన్న పట్టుదలతో టీఎంసీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని, నిరంతరం నిఘా ఉంచాలని మమతా బెనర్జీ తమ పార్టీ అభ్యర్థులను ఆదేశించారు.
అంతకుముందు, తృణమూల్ కాంగ్రెస్ ( నాయకులు కునాల్ ఘోష్, శశి పంజా ఖుదీరామ్ అనుశీలన్ స్ట్రాంగ్ రూం వెలుపల వెలుపల ధర్నాకు దిగారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేకుండానే బాలెట్ బాక్సులను తెరుస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా పార్టీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/mamata-banerjee-at-the-strong-room-at-midnight-25-218682.html




