నాచారం పారిశ్రామిక వాడలో ఘోర అగ్నిప్రమాదం
Publish Date:Apr 18, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాచారం నుంచి చిల్కా నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న టెంట్ హౌస్‌కు చెందిన గోదాంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గోదాంలో నిల్వ ఉంచిన టెంట్లు, అలంకరణ సామగ్రి తదితర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాంనికి ఆనుకుని ఉన్న పరుపుల కంపెనీకి మంటలు వ్యాపించే ప్రమాదం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు సుమారు అరగంటకు పైగా తీవ్రంగా శ్రమించారు. వారి సమయోచిత చర్యలతో మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే గోదాంలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/major-fire-in-nacharam-36-217708.html





