మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ కే!
Publish Date:Oct 9, 2025
Advertisement
జూబ్లీహిల్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ ఎవరివైపు అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా జూబ్లీ బైపోల్ లో పోటీ అంటూ లీకులిచ్చిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు పోటీలో లేదు. కాంగ్రెస్ జూబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించడంతోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా విజయం సాధించడం కష్టమే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఒకింత ఎక్కువే. బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో నిలబడే పార్టీ అభ్యర్థి పేరు అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారం ప్రారంభించేయడం, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించుకోలేక మల్లగుల్లాలు పడుతుండటంతో.. జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. అయితే అందరూ ఊహించినట్లుగానే.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు అయ్యారు. ఈయన ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకచక్యంగా, ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. నవీన్ యాదవ్ వినా మరెవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మజ్లిస్ మద్దతు లభించే అవకాశాలు లేవు. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం అంత తేలిక కాదు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అజారుద్దీన్ మొదలకుని ఈ నియోజకవర్గ టికెట్ కోసం రేసులో ఉన్న ఒక్కొక్కరినీ పక్కకు తప్పించి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారయ్యేలా చూశారు. ఇందుకోసం ఆయన అధిష్ఠానాన్ని ఒప్పించారు. ఎవరినీ నొప్పించకుండానే.. పక్కకు తప్పించి తాను కోరుకున్నట్లు నవీన్ యాదవ్ కు పార్టీ హైకమాండ్ టికెట్ కన్ ఫర్మ్ చేసేలా చూశారు. అయితే జూబ్లీ బైపోల్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ పై కేసు నమోదు కావడంతో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పునరాలోచనలో పడుతుందా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమయ్యాయి. అయితే కాంగ్రెస్ నవీన్ యాదవ్ నే అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే.. ఆయనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. పైగా మజ్లిస్ పార్టీలో అనుబంధం ఉంది. తొలి నుంచీ కూడా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉంటే మద్దతు ఇస్తామని మజ్లిస్ లోపాయికారీగా చెబుతూ వస్తున్నది. మజ్లిస్ మద్దతు ఉంటే నియోజకవర్గ పరిధిలో దాదాపు 90 వేల పైచిలుకు ఉన్న మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడతాయి. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వమే ఖరారయ్యేలా పావులు కదిపారు. ఇక ఇప్పుడు సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న బీఆర్ఎస్ తన ఆశ నెరవేరాలంటే చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/majlis-party-support-congress-39-207583.html





