బీఆర్ఎస్ పై నేతల్లో తొలగుతున్న భ్రమలు.. కుటుంబ కలహాల ప్రభావం
Publish Date:Aug 4, 2025
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందా? పార్టీ పరిస్థితి, మనుగడపై ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల్లోనే గందరగోళం నెలకొందా? అంటే బీఆర్ఎస్ శ్రేణులే ఔనంటున్నాయి. అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఏదో అప్పుడప్పుడు ఎర్రవల్లి వచ్చిన నాయకులతో చిట్ చాట్ నిర్వహించడం తప్ప ఆయన పార్టీ వ్యవహారాలలో కానీ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కానీ క్రియాశీలంగా వ్యవహరించింది లేదు. పార్టీ కార్యక్రమాలన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఇక్కడే పార్టీ నాయకుల్లో విభేదాలు, అసంతృప్తులు మొదలయ్యాయి. కేటీఆర్, కవిత మధ్య అంతరం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అయితే వీటి పరిష్కారంపై కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చివరకు తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్టీలో పరిస్థితిపై లేఖరాసినా కేసీఆర్ స్పందించక పోవడంతో.. కొందరు ఆ లేఖ ను లీక్ చేశారు. దీంతో కేసీఆర్ సంతానం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రచ్చకెక్కయి. ఈ నేపథ్యంలోనే కవిత జిల్లాల పర్యటనలు చేశారు. ఈ పర్యటనల్లో తాము పాల్గొనాలా వద్దా అనే విషయంపై అధినేత కేసీఆర్ నుంచి అనుమతి కోసం ప్రయత్నిస్తే.. ఆయన కేటీఆర్ ను సంప్రదించమని చెప్పి చేతులెత్తేశారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు అన్నీ కేటీఆర్ చేతుల్లోకి వెళ్లాయి. దీనిపై పార్టీలోని కొందరు అసంతృప్తితో ఉన్నారు. అందరినీ కలుపుకుని పోకుండా కేటీఆర్ కొందరికే అందుబాటులో ఉండటంపై మెజారిటీ నాయకులు అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ కు చెప్పలేక సతమతమవుతున్నారు. కేటీఆర్ శైలి నచ్చక వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు చూసుకొని పార్టీలో కొనసాగాలా లేక వైదొలగాలా అనే మీమాంసలో ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కూడా జిల్లాల్లో నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.. ఈ పరిణామాలన్నీ పార్టీని గందరగోళంలో పడేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/leaders-loosing-hopes-on-brs-39-203447.html





