గుర్రమెక్కిన లాలూ పెద్ద కొడుకు!
Publish Date:Dec 26, 2015
Advertisement
లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ గుర్రం ఎక్కాడు. అవును నిజంగా గుర్రమే. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి నితీష్ కుమార్ ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, మరియు అడవులు పర్యావరణ శాఖామంత్రి అయిపోయిన తేజ్ ప్రతాప్ యాదవ్ పాట్నాలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి అందరూ గుర్రాలు ఉపయోగించాలని పిలుపు నిచ్చేందుకు స్వయంగా గుర్రం ఎక్కి రోడ్ల మీద షికారు చేసాడు. కాలుష్య నివారణ కోసం మంత్రిగారే గుర్రం ఎక్కినప్పుడు అతని భద్రతాధికారులు పోలీస్ వాహనాలలో ఆయన వెంట సాగలేరు కనుక వారు కూడా గుర్రాలు ఎక్కారు. ముందు వెనుక రెండు డజన్ల గుర్రాల మీద భద్రతాధికారులు అనుసరిస్తుంటే, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కిరీటం లేని రాజుగారిలాగ ముందుకు కదిలారు. ఆ సంగతి తెలుసుకొన్న మీడియా గుర్రాలు లేకపోయినా ఆయన వెంట పరుగులు తీస్తూ చకచకా ఫోటోలు తీసుకొంది. కాలుష్యం నివారించదానికి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరినీ సైకిల్స్ వాడమని సూచిస్తుంటే, ఆరోగ్య మంత్రిగారు మాత్రం గుర్రాలు వాడమని సూచిస్తున్నారు. అందుకు జనాలు ఒప్పుకొంటే గుర్రాలు కొనుకోవడానికి బ్యాంకుల నుండి రుణాలు కూడా ఇప్పిస్తారేమో?ఆ తరువాత వాటిని మేపడానికి గడ్డి అవసరం ఉంటుంది కనుక దాని కోసం తమ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ని సంప్రదించమంటారేమో?
http://www.teluguone.com/news/content/lalu-prasad-yadav-39-53924.html





