లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డిలో అరెస్టు భయం
Publish Date:Jul 15, 2025

Advertisement
తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తి వ్యవహారంలో వాస్తవాలను వెలికి తీయడం లక్ష్యంగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ లో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ సిట్ కు సీబీఐ డైరెక్టర్ నేతృత్వం వహిస్తుండగా, రాష్ట్ర పోలీసు శాఖ, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యింది. తన దర్యాప్తులో కనుగొన్న విషయాలను సిట్ సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదించింది. లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి సిట్ 14 మందిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిలో బోలెబాబా డెయిరీ, ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. అలాగే సిట్ తన దర్యాప్తులో బాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న సహా పలువురు టీటీడీ ఉద్యోగులను విచారించింది. ఈ విషయాన్ని కూడా సిట్ సుప్రీంకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఈ కేసులో నిందితులు దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది.
ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కేసులో దర్యాప్తు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుని రాజకీయ ఒత్తిడిని తీసుకువస్తోందని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. కాగా సుబ్బారెడ్డి బెయిలు పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు లిస్ట్ చేయవలసిందిగా.. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ నిలయ్ విపిన్ చంద్రఅంజారియాల ధర్మాసనం కోరింది. అదలా ఉంచితే.. లడ్డూ ప్రసాదం తీయారీలో వినియోగిచిన నెయ్యిలో కల్తీ వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారన్న భయం సుబ్బారెడ్డిలో పెరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/laddu-prasadam-adultration-case-25-202032.html












