అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు..! : సీఎం చంద్రబాబు
Publish Date:Jul 4, 2026
Advertisement
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు. తరతరాలుగా సాగుచేస్తున్న భూములకు అధికారిక హక్కు పత్రాలు అందుకోవడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో నిర్వహించిన డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 460.19 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 61 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా గ్రామస్థులను వేధిస్తున్న భూ సమస్యను సమగ్ర రికార్డుల పరిశీలన, వివిధ కోణాల్లో అధ్యయనం చేసి పరిష్కరించినట్లు తెలిపారు. అడవి పొరంబోకు భూమిని అసైన్డ్ వేస్ట్ డ్రై భూమిగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుని రైతులకు భూములు అందించినట్లు చెప్పారు. పేదలకు పట్టాల పంపిణీ సంతోషంగా ఉంది.. రైతుల పక్షాన న్యాయం ఉండటంతోనే ఈ సమస్యను పరిష్కరించగలిగామని పేర్కొన్న సీఎం, 322 మంది రైతులకు 460.19 ఎకరాల భూమిని పట్టాల రూపంలో ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు. కంగుంది కోట సాక్షిగా రైతులకు పట్టాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అనేక రెవెన్యూ, భూ సమస్యలు ఉన్నాయని, ఇటీవల శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి దక్కడంతో పాటు రైతులకు కూడా న్యాయం జరిగిందన్నారు. వట్టిచెరుకూరు గ్రామంలో వందల ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యను కూడా పరిష్కరించామని, ఇప్పుడు కంగుంది సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశముందని పేర్కొన్నారు. గూండాయిజానికి తావులేదు.. గత ప్రభుత్వ హయాంలో అనేక భూ వివాదాలు సృష్టించారని ఆరోపించిన సీఎం, ప్రజల పట్టాదార్ పాస్ పుస్తకాలపై గత పాలక పార్టీ నేతల ఫొటోలు ముద్రించారని విమర్శించారు. వాటిని తొలగించి రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశామని చెప్పారు. భూ వివాదాల పరిష్కారంలో ఓపికతో వ్యవహరించి అన్ని రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భూములకు భద్రత కల్పించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. కుటుంబ ఆస్తి వివాదాల కారణంగా కూడా అనేక భూములు వివాదాస్పదమవుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, సోదరీమణుల హక్కులను గౌరవించాలని సూచించారు. రౌడీయిజం, గుండాయిజానికి రాష్ట్రంలో తావులేదని స్పష్టం చేసిన ఆయన, పెట్టుబడులు ఆకర్షిస్తూ పరిశ్రమలు తీసుకొస్తున్నామని, కుప్పంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కుప్పాన్ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసి మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అభివృద్ధిని ఆపలేరు... అడ్డుకోలేరు.. ‘కుప్పం ప్రజలంతా సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్య మివ్వాలనీ సీఎం అన్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం బదులు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఈ సైకిళ్లు, ఈ వెహికల్స్ వినియోగం పెంచాలనీ సూచించారు. నెట్ జీరో విధానంలో స్వచ్ఛ కుప్పం-స్వర్ణ కుప్పం సాధించాలనీ పిలుపు నిచ్చారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రొత్సహిస్తున్నామని.. ఇప్పటికే 1.50 లక్షల మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. డ్వాక్రా మహిళా ఉత్పత్తుల కోసం స్వయం బ్రాండ్ ఏర్పాటు చేశామని..దీని ద్వారా అంతర్జాతీయ స్థాయికి డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్ వచ్చేలా చేస్తామని తెలిపారు. కుప్పం పొగురుపల్లిలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 30 ప్రాజెక్టుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. గత పాలనలో రాష్ట్రానికున్న బ్రాండ్ పొగొట్టారనీ.. పరిశ్రమలను వెళ్లగొట్టారు. కానీ ఈ రెండేళ్ల కాలంలో పోయిన బ్రాండ్ ను తిరిగి తెచ్చామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం చేస్తుంటే.. గొడ్డలి పార్టీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారనీ సీఎం ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/kuppam-agriculture-hub-36-225082.html





